
రాష్ట్ర కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీ
భర్తీ చేసేందుకు పార్టీ మల్లాగుళ్లాలు
సామాజిక వర్గాల వారిగా కసరత్తు షురూ
బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం
ఓపెన్ కోటాలో కొందరిని ఎకామిడేట్ చేసే యోచన
సమీకరణలపై వేగం పెంచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
పదవుల కోసం ఎవరికి వారిగా ప్రయత్నాలు షురూ..
హైదరాబాద్, డిసెంబర్ 16
తెలంగాణ కొత్త కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఆరు మంత్రి పదవులు ఎవరికీ దక్కనున్నాయనేది నేడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు ఎవరికి కేటాయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారి లిస్టు పెద్దదిగానే ఉంది. అయితే కొన్ని సామాజిక వర్గాలకు, పార్టీ సీనియర్లు, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి మంత్రి పదవుల్లో స్థానం దక్కేవిధంగా పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌లో చాలా మంది ప్రముఖులు సీనియర్ల ఉన్నా కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. దీంతో వాళ్లను సైతం ఎకామిడేట్ చేయడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే డైలమా?.
హైదరాబాద్ లాంటి మహానగరంలో పార్టీ అభ్యర్థులు గెలువక పోగా మంత్రిపదవి దక్కలేదు. దీనికి తోడు కొందరు పార్టీ సీనియర్లకు అవకాశం కల్పిద్దామంటే వారి పలు కారణాలతో ఓటమి చవిచూశారు. దీంతో ఎవరికి మంత్రిపదవి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది. దీంతో మంత్రి పదవులపై డైలమా కొనసాగుతూనే ఉంది. దీన్ని అదిగమించడానికి ఈ నేపథ్యంలో ఓడిన వారిలో కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉన్న వారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పార్టీ లాయల్‌గా పని చేసిన వారికి ఎమ్మెల్సీల్లో ప్రాధాన్యత కల్పించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
సామాజికవర్గాల వారిగా సమీకరణలు..
ఎమ్మెల్సీ ఇవ్వడానికైనా, మంత్రిపదవి దక్కడానికైనా సామాజిక సమీకరణలు తప్పని సరి పాటించాలనే దానిపై పార్టీ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు మంత్రి పదవి ఇచ్చేందుకు పెద్ద ఎత్తున సమీకరణలు జరుగుతున్నాయి.

మైనార్టీ వర్గాల్లో..
మైనార్టీ వర్గానికి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చవి చూసిన ఫిరోజ్‌ఖాన్‌లు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ అయిన షబ్బీర్ అలీకే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ)వర్గాల్లో..
మరోవైపు ఎస్టీ సామాజిక వర్గంలో ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఆదివాసీ, లంబాడ సామాజికవర్గం సీనియర్ నేతలపై పార్టీ దృష్టిపెట్టింది. ఆదివాసీల్లో కోయ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆదివాసీ ప్రజాప్రతినిధిగా గత మూడు దశాబ్ధాలకు పైగా పార్టీకి సేవచేస్తూ పార్టీకి లాయల్‌గా ఉన్న పోదెంను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్ సర్కారు కోట్ల రూపాయలు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించినా పార్టీ వీడకుండా లాయల్‌గా ఉన్నాడనే కారణంగా పోదెంకు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లంబాడాల్లో బలరాం నాయక్ లాంటి సీనియర్లను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు వున్నాయి.

షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గాల్లో…
ఎస్సీ సామాజిక వర్గాల్లో ఇప్పటికే ఇద్దరికి అవకాశం కల్పించినా మరో ఎస్సీకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గంలో మంత్రి పదవి రేసులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లయినా ఈ ఇద్దరిలో ఏఒక్కరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

వెనుబడిన (బీసీ) సామాజిక వర్గాల్లో..
బీసీ సామాజిక వర్గాల్లో కేవలం ఒక్కరికే మంత్రి వర్గంలో స్థానం లభించింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు ఇప్పటికే మంత్రి పదవి దక్కగా, ఇదే సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీసీలకు ప్రాధాన్యత క్రమంలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఓడిపోయిన పార్టీ సీనియర్లను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గంతో సీనియర్లు మాజీ ఎంపీలు మధు యాష్కిగౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ లు మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒక్కరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

ఓసీ సామాజిక వర్గాల్లో…
ఇప్పటికే ఓసీ సామాజిక వర్గాలకు మంత్రి పదవులు దక్కినా మరో ఒక్కరిద్దరికి మినిస్ట్రీ రావచ్చని తెలుస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ లో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే, ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర రాజధాని కావడంతో ఇక్కడి నుంచి కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఓసీ కోటాల మైనంపల్లి హన్మంతరావు, అదే విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, ఏమ్మెల్సీ జీవన్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానం దక్కింది వీరికే..
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావులు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖలు మాత్రమే కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. మిగతా మంత్రుల ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవుల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణలు ఏమేరకు ఫలిస్తాయో ఇంకొన్నాళ్లు వేచిచూడాల్సిందే..