
ఈ రోజు కన్నెపల్లి నుండి మేడారానికి సారలమ్మ రాక
మేడారానికి సమ్మక్క, సారలమ్మ ల ఆగమనం…
ఆద్వితీయ గట్టం నేడు
హైదరాబాద్, ఫిబ్రవరి 21: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం తో… భక్తులకు కలిగే అద్భుత అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెరలు) ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకొస్తారు. గిరిజన సంప్రదాయక వాయిద్యాలతో సమ్మక్క, సారక్కలను తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది.

మేడారం జాతరలో ప్రతీ ఒక్క సన్నివేశం ఆదివాసీ ప్రత్యేక సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంటుంది. మంత్రాలు, హంగులు, ఆర్భాటాలు ఉండక తమదైన విశిష్ట ఆరాధ్య విధానాలతో జాతరలోని ప్రతీ ఘట్టం ఉంటుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం చిలకల గుట్ట నుండి సమ్మక్క ఆగమన దృశ్యం
అధికారుల ఆహ్వానంతో మేడారానికి కదిలే సారలమ్మ మేడారంలో తొలి మరో ఘట్టం కన్నెపల్లి నుండి సారలమ్మ రావడం. మేడారానికి ఏడెనిమి కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మ మేడారం గద్దెలవద్దకు రావడం, ప్రధానంగా కన్నెపల్లి గుడి నుండి కోయ పూజారులు సారలమ్మను బయటికి తెచ్చే విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.
లక్షలాది భక్తుల తన్మయత్వం నడుమ, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ నుండి వచ్చే ఆదివాసీలు, గుత్తి కోయల నృత్యాల మధ్య సారలమ్మ రావడం ఒక అద్భుత దృశ్యం. జిల్లా జాయింట్ కలెక్టర్ (ఇప్పటి అడిషల్ కలెక్టర్ ) సారలమ్మ అమ్మవారికి స్వయంగా స్వాగతం పలుకుతారు. పోలీసు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ సందర్బంగా హాజరవుతారు. కన్నెపల్లి లో సారలమ్మ వెళ్లే మార్గంలో వందలాది మంది మార్గ పొడుగునా పడుకొని ఉండడం (దీనినే వరాలు పట్టడం అంటారు), తమపై నుండి సారలమ్మ వెళితే తమ కస్టాలు, అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మకం. ఇక్కడ కోయలు వాయించే డోళ్ళ సప్పుడు ప్రత్యేకత గా చెప్పవచ్చు. సారలమ్మ రాక కు ఒక గంట ముందు నుండే వాయించే డోలు వాయిద్యాలు హోరు, అక్కడి వాతావరణాన్ని ఒక తన్మయంలోకి తీసుకెళ్లేవిధంగా ఉంటుంది. శిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండే ఆ మహిళలు, వారిని పట్టుకోలేక ఆశక్తులవుతూండే పురుషులు, ఇక, గుడి వెలుపల ఛత్తీస్ గఢ్ గుత్తి కోయలు తమదైన ప్రత్యేకమైన అలంకారాలు, వేష దారణలతో చేసే నృత్యాలు, చూస్తేనే కానీ వాటిని వివరించలేం. ఇక, కన్నెపల్లి కి చెందిన ఆదివాసీ యువతులు ముందుగా ఈ సారలమ్మ గుడికి అలుకుడు పెట్టి ముగ్గులు వేయడంతో ప్రారంభమయ్యే సారలమ్మ రాక, ఇక్కడే ఏర్పాటు చేసిన మేక పోతు జడితి ఇవ్వడంతో మొదలవుతుంది.

ముందుగా
జరిగే తంతు....
వంశానికి చెందిన వడ్డెలు (కోయ పూజారులు} సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది దాదాపు ఒక గంట పాటు ఉంటుంది. అనంతరం, జాయింట్ కలెక్టర్ (ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ ), ఇతర అధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సారలమ్మ ఆలయ ఆవరణలో ఒక మేకపోతు జేడ్తి ఇచ్చిన అనంతరం, గుడిలోనుండి తెల్లని వస్త్రంతో తయారు చేసిన హనుమంతుడి బొమ్మతో ఉన్న పతాకంతో వడ్డెలు ఒక్కసారిగా గుడి నుండి బయటకు రావడం సారలమ్మ రాకకు చిహ్నంగా ఉంటుంది. సారలమ్మ తో గుడి చుట్టూ ప్రదక్షణం చేసిన అనంతరం దారిపై పడుకొని ఉన్న వందలాది భక్తులపై నుండి సారలమ్మ ను తీసుకెళ్లే వడ్డెలు నడుచుకుంటూ కన్నెపల్లి గ్రామంలో పర్యటిస్తారు. గ్రామస్తులు తమ ఇంటి ముందు సారలమ్మకు నీటిని ఆరపోసి, కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయంతో నే జరిగే ఈ సారలమ్మ ఆగమనం సందర్బంగా కన్నెపల్లి ఆలయంతోపాటు చుట్టూ కనీసం ఒక అర కిలోమీటర్ పొడుగునా భక్తులతో పూర్తిగా నిండి పోతుంది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆదివాసీలు తన్మయత్వంతో చేసే శిగాలు గిరిజన సంస్కృతిని ని ప్రతిబింబిస్తాయి.


కన్నెపల్లి నుండి బయలు దేరిన సారలమ్మ మధ్యలో ఉన్న జంపన్న వాగులో పారే నీళ్ళనుండి మేడారం గద్దెలకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటలకు పైగానే పడుతుంది. ఇదే సమయానికి గోవింద రాజులు, పడిగెడ్డ రాజులు కూడా మేడారం లోని వారి వారి గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా, మేడారం జాతర లోని తొలిరోజు కార్యక్రమం అత్యంత వైభవంగా, పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయంతోనే జరుగుతుంది.

*గట్టమ్మను దర్శించుకున్నాకే
* ... మేడారం జాతరకు వెళ్లే భక్తులు, మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. లేకపోతే తిప్పలు తప్పవని భక్తుల నమ్మకం. వరంగల్ నుంచి మేడారం వెళ్లే దారిలో (వరంగల్-ఏటూరునాగారం రోడ్) ములుగు పట్టణానికి వెళ్లడానికి ముందు రోడ్ పక్కనే గట్టమ్మగుడి ఉంటుంది. గట్టమ్మకు ముందుగా మొక్కులు చెల్లించకుండా వెళ్తే గట్టమ్మ ఆగ్రహానికి గురికాకతప్పదని భక్తుల నమ్మకం. మేడారం జాతర పనులు ప్రారంభించడానికి ముందు వరంగల్ జిల్లా అధికారులు కూడా ముందుగా గట్టమ్మకు పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది.
