
ఆయనో సివిల్ సర్వీసు అధికారి.. వేల మంది పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక సింగరేణి సంస్థ సారథిగా క్షణం తీరిక లభించదు. అయినా సరే పుడమిపై పచ్చదనాన్ని పెంచాలన్నది ఆయన అభిమతం. అందుకోసం సింగరేణిలో మొక్కలు నాటే మహా యజ్ఞానికి ఐదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. కేవలం కింది స్థాయి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకోలేదు.. అలాగని ఒకటి రెండు మొక్కలు నాటి ఫొటోలు దిగి తప్పుకోలేదు. సింగరేణి వ్యాప్తంగా స్వయంగా 18000 మొక్కలు నాటి సింగరేణీయుల్లో పచ్చదనం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన నాటిన మొక్కలు సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 34 ప్రదేశాల్లో మినీ ఫారెస్టులుగా మారడం విశేషం. సింగరేణి అవనిపై ఆకుపచ్చ సంతకం చేస్తున్న సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ పై ప్రత్యేక కథనం.


ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్లో పర్యావరణ విధ్వంసం నేడు అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికులైన కొందరు మేధావులు, రైతులు ,అధికారులు, సాధారణ ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేస్తూ చైతన్యపరచడం మనకు తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ అంటూ మాటలు చెప్తే సరికాదు చేతల ద్వారా చేసి చూపించాలి అని కొందరు పర్యావరణహితులు ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ప్రముఖులలో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ను ఒకరిగా పేర్కొనవచ్చు. పర్యావరణం పట్ల ప్రత్యేక అభిమానం ప్రేమ గల ఎన్. బలరామ్ 2019 నుండి ఇప్పటి వరకు సుమారు 18 మొక్కలను స్వయంగా తన చేతులతో నాటి వాటిని వనాలుగా పెంచుతున్నారు. ఒక ప్రభుత్వ సంస్థ ఉన్నతాధికారులుగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా పార పట్టుకుని స్వయంగా మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు కృషి చేయడం చాలా అరుదు. దేశంలోనే ఇలా ఒక సివిల్ సర్వీసెస్ అధికారి వేలాది మొక్కలు నాటడం ఇదే ప్రథమం.

మహబూబ్‌నగర్ జిల్లాలో కడుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ఎన్. బలరాముకు చిన్నప్పటి నుండి మొక్కలపై ప్రత్యేకమైన ఆసక్తి. చిన్నతనంలోనే నర్సరీకి వెళ్లి తన గ్రామానికి వచ్చే దారిలో అనేక మొక్కలు నాటాడు ఆయన. సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఫైనాన్స్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన చిరకాల స్వప్నమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.
2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జూన్ 5వ తేదీన 108 మొక్కల్ని కొత్తగూడెం బంగ్లోస్ లో తాను ఒక్కడే నాటి తన వృక్ష మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఆయన సింగరేణి వ్యాప్తంగా 12ఏరియాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో ప్రతి చోటా కనిష్టం 150 నుండి గరిష్టంగా 1250 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు.
చిన్నతనం నుంచి కాయకష్టం చేసి కూలీగా, రైతుగా కూడా పనిచేసిన అనుభవం, శ్రమ పట్ల గౌరవం కలిగిన ఎన్. బలరామ్ స్వయంగా మొక్కలు నాటదాన్ని ఇష్టపడుతుంటారు. అందుకే తాను మొక్కలు నాటేటప్పుడు ఇతరుల సహాయాన్ని సహకారాన్ని తీసుకోవడాన్ని ఇష్టపడరు.అప్పటి వరకు అధికారిక హోదాలో సూటు బూటు వేసుకొని యుండే ఆయన, మొక్కలు నాటే ప్రాంతానికి రాగానే బనియన్, నిక్కరు లోనికి మారిపోయి పార తీసుకొని మొక్క తర్వాత మొక్క నాటుతూ ముందుకు సాగుతుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది మొక్కలను ఏకబిగిన నాటుతుంటారు. జోరున కురిసే వర్షంలో మండుటెండలో కూడా ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావించి తన పనిని కొనసాగిస్తుంటారు.

రామగుండం 3 ఏరియాలో 120 అడుగుల ఎత్తులో ఉన్న ఓపెన్ కాస్ట్ 1 డంపు యార్డు పైన ఆయన 2019 సెప్టెంబర్ 15 తేదీన 1251 మొక్కలను కేవలం గంటన్నర సమయంలో నాటడం జరిగింది. అలాగే శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ డంప్ పైన 1237 మొక్కల్ని కేవలం గంట సమయంలో లోపే నాటారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయనను ఘనంగా సన్మానించారు. “పర్యావరణం పట్ల చాలా మందికి అభిమానం ఉండొచ్చు. కానీ అది మాటల వరకే పరిమితం అవుతుంది. కానీ ఎన్. బలరామ్ మాత్రం మాటలు కాదు చేతల ద్వారా చూపించాలని స్వయంగా మొక్కలు నాటుతూ ఆదర్శప్రాయులుగా నిలిచారని” ప్రశంసిస్తూ పలువురు ఆయన్ను ఘనంగా సన్మానించారు.

ఎన్. బలరామ్ శ్రీరాంపూర్ లోని కోల్ కెమికల్ కాంప్లెక్స్ వద్ద 1061మొక్కలు ఏకబిగిన నాటడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కు సమీపంలో కూడా ఆయన 1151 మొక్కలను ఒకేసారిగా నాటారు. ఈ విధంగా ఎన్. బలరామ్ సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాలలో మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ శ్రీ ఎన్. బలరామ్ స్వయంగా మొక్కలు నాటుతూ వెళ్లారు. మియావాకీ పద్ధతిలో భూపాల పల్లి, రామగుండం, ఇల్లందు ప్రాంతాల్లో చిట్టడువులకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికి మొత్తం 40 ప్రాంతాల్లో 39.78 ఎకరాలలో 17,700 మొక్కలను నాటడం జరిగింది.ఈ విధంగా ఆయన 2019 సంవత్సరంలో 6,313 మొక్కల్ని నాటగా 2020లో 3,686 మొక్కలు, 2021లో 2,810 మొక్కలు, 2022లో 2,460 మొక్కలు, 2023లో 2,431 మొక్కలు నాటారు. ఇదే కాకుండా ఆయన పర్యటించిన ప్రతీ దేశంలో, అడుగుపెట్టిన ప్రతీ రాష్ట్రంలోనూ పర్యావరణ పరిరక్షణపై అక్కడి వారిలో అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అక్కడ, ఢిల్లీలో, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ మొక్కలు నాటారు.
ఎన్. బలరామ్ నాటుతున్న మొక్కల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే అడవుల నుంచి అంతరించిపోతున్న అనేక జాతుల మొక్కలను ఆయన నాటుతున్నారు ముఖ్యంగా రావి, మర్రి, జువ్వి, సీమచింత వంటి 20 జాతులు మొక్కలు ఆయన నాటుతున్న వాటిలో ఉంటున్నాయి. అలాగే కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించేందుకు వీలుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే-5 గని సమీపంలో 600లకు పైగా పండ్ల మొక్కలను నాటడం విశేషం.

వనాలుగా పెరుగుతున్న మొక్కలు
ఎన్. బలరామ్ నాటిన మొక్కలు నేడు అన్ని ఏరియాల్లో చిరు వనాలుగా పెరుగుతున్నాయి. కొన్ని మొక్కలు కాయలు కాస్తున్నాయి. పక్షులకు జంతువులకు ఆలవాలమవుతున్నాయి. ఆయన తాను మొక్కలు నాటిన ప్రతి ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేయించారు. ఈ జియోట్యాగింగ్ ద్వారా ఆయన ప్రతినిత్యం ఉదయం పూట ఏ ఏ ప్రాంతాల్లో మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తుంటారు. మొక్కల ఎదుగుదలను ఆయన పర్యవేక్షిస్తూ సమీక్షిస్తుంటారు. ఎక్కడన్న మొక్కలు సరిగా ఎదగలేదని అనిపిస్తే అక్కడ తిరిగి తన పర్యటన సందర్భంగా మొక్కలు నాటుతారు. కనుక ఆయన నాటిన ప్రాంతాలు మొత్తం 90% పైబడి మొక్కలు పాదుకొని వృక్షాలుగా ఎదుగుతున్నాయి.

‘‘ప్రతి మనిషి కనీసం మూడు ఒక్కరు నాటాలి మొక్కలు నాటాలి’’ ఎన్. బలరామ్ ఈ విధంగా స్వయంగా తాను మొక్కలు నాటడం పై స్పందిస్తూ “ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నేడు అడవులు అంతరిస్తూ పోవడం వల్ల ఆక్సిజన్ శాతం తక్కువ అయి భూమి ప్రమాదంలో కూరుకుపోతోంది.
మొక్కను నాటడం వల్ల అది తన జీవిత కాలంలో మన మనుగడకే కాకుండా పుడమిలోని ప్రతీ జీవజాతి మనుగడకు దోహదపడుతుంది.మనం నాటే చెట్టు వల్ల లభించే ఆక్సిజన్‌ను సరిహద్దులు లేకుండా ప్రతీ ఒక్కరూ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజూ ఒక మొక్కను నాటాలని సంకల్పించాను. దాని ప్రకారం 15695 మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 18000 మొక్కలను నాటాను. ఈ ఏడాది ఇంకో 2000 మొక్కలను నాటాలని సంకల్పం పెట్టుకున్నాను. అయితే పెద్ద హోదాలో ఉన్న నేను నాటిన మొక్కను సంరక్షించాలన్న బాధ్యతతో చిన్న ఉద్యోగులు మొదలుకొని ప్రతీ ఒక్క అధికారి భావిస్తారు. వారి సహకారం వల్ల నేను నాటిన మొక్కల్లో 90 శాతం వృక్షాలుగా మారాయి. వారందరికీ కృతజ్ఞతలు. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, భూకంపాలు, వరదలు వస్తున్నాయి. యుద్దాల కన్నా అత్యంత ప్రమాదకరమైన సమస్య పర్యావరణ సమస్య. ముఖ్యంగా మహానగరాల్లో స్వచ్ఛమైన గాలి లభించక అందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ నేడు స్పందించకపోతే తర్వాతి తరాలు ప్రమాదంలో చిక్కుకుంటాయి. కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను. “


అని ఎన్. బలరామ్ సందేశం ఇస్తున్నారు. అలాగే వివిధ ఏరియాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయన కచ్చితంగా తాను మొక్కలు నాటిన ప్రదేశానికి వెళ్తూ.. ఎదుగుతున్న మొక్కలను చూస్తూ ఎదిగిన కొడుకును చూసి తండ్రి మురిసిపోయినట్లుగా భావోద్వేగానికి గురవుతుంటారు. ఒక ఉన్నతాధికారి ఈ విధంగా మొక్కలు నాటడం అందరికీ ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని నింపి భూ తాపాన్ని తగ్గించే క్రతువులో సింగరేణి ఉద్యోగులూ పాలుపంచుకునేలా దోహదపడుతోంది.

ఎన్.బలరామ్ చిన్నతనం మొత్తం కష్టాలు, కన్నీళ్లమయమే. వెనకబడిన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ అయిన ఆయన తిరుమలగిరికి చెందిన హూన్య, కేస్లీ దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడు. ఆయన చిన్నతనంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక తల్లిదండ్రులకు భారం కావొద్దన్న ఉద్దేశంతో కూలీ పని చేశారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా, హమాలీగా, రైతు కూలీగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారు. కూలీ పని చేస్తూనే 10వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పదో తరగతి తర్వాత హైదరాబాద్ వలస వచ్చారు. ఇంటర్మీడియట్ లోనే ఆయనకు వివాహం కావడంతో ఉన్నత చదువులు భారమయ్యాయి. దీంతో తన కుటుంబ భారం మోయడానికి గ్యాస్ సిలిండర్ డెలవరీ బాయ్‌గా పనిచేశారు. షేరింగ్ ఆటో నడిపారు. కుటుంబ భారాన్ని మోస్తూనే చదువు పట్ల ఆసక్తితో పట్టుదలతో శ్రమించారు. అకుంఠిత దీక్షతో 2010లో సివిల్స్ లో రెవెన్యూ సర్వీసుకు ఎంపికయ్యారు. 2019 నుంచి సింగరేణి డైరెక్టర్ గా మూడు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. 2024 జనవరి 1 నుంచి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీగా విజయవంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సంస్థ చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్ సాధించేలా అందరిలోనూ స్ఫూర్తినింపారు.


పేదరికాన్ని ప్రత్యక్షంగా అనుభవించి.. కష్టాలను అధిగమించి ఐఆర్ఎస్ వరకు సాగిన ఆయన విజయ ప్రస్థానంలో ఎదురైన సంఘటనలను ఆయన ఎప్పుడూ మరచిపోలేదు. అయితే తనలాగా మరెవరూ ఇబ్బందులు పడొద్దని ఆయన అనుక్షణం మథన పడుతుంటారు. అందుకే పేదరికంలో ఉన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు వారి కోసం ప్రతి ఏడాది పుస్తకాలను, యూనిఫాంను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. సొంతంగా గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అవకాశాలు అందిపుచ్చుకోలేమని బాధపడే విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే భవిష్యత్ తరాలకు అందమైన ప్రకృతిని అందించేందుకు మొక్కలు నాటుతూ తనలోని సామాజిక స్పృహను చాటుతున్నారు. అందరిలోనూ పర్యావరణ స్పృహను కల్పించేందుకు కృషి చేస్తున్నఆయన సేవలను గుర్తిస్తూ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు గ్రామోదయ బంధు మిత్ర పురస్కారంతో సత్కరించారు. సమాజ అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలు అందించే వ్యక్తులకు ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్ డీ ఎఫ్ సీ ప్రకటించే ప్రతిష్టాత్మక అవర్ నై బర్ హు డ్ హీరో పురస్కారం కూడా వరించింది.
