
ఫ్యూచర్ సిటీకి డీజేహెచ్ఎస్ విజిట్
ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్న సీఎం
సీఎం ప్రకటనను స్వాగతించిన జర్నలిస్టులు
సీఎంరేవంత్ రెడ్డికి కు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించిన డీజెహెచ్ఎస్
ఆరు నెలల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముక్త కంఠంతో విన్నపం
హైదరాబాద్, నవంబరు 10,2024
సీఎం నిర్ణయం తమకు ఆమోదయోగ్యమని, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) స్పష్టం చేసింది. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) సభ్యులు వందలాదిమంది ఫ్యూచర్ సిటీని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తూ డీజేహెచ్ఎస్ సభ్యులు నెట్జీరో సిటీ ప్రాతంలో మీర్ఖాన్పేట్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు చొరవ చూపిన సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈ సమావేశంలో డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో డీజేహెచ్ఎస్ ప్రెసిడెంట్ బొల్లోజు రవి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కు ఇది నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటైందనీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం వస్తున్నందున ప్రజారవాణా వేగవంతమవుతుందనీ, అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.


వైస్ ప్రెసిడెంట్ మరిపాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోందనీ ఇందులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేయడం జర్నలిస్టుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయన్న స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తదితర ప్రాజెక్ట్లు రాష్ట్రానికే తలమానికం కాబోతున్నాయని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున సాధించుకునేందుకు జర్నలిస్టులు సమిష్టిగా కృషి చేయాలని రవి, శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

డీజెహెచ్ఎస్ ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు ఎకరానికి గుంట చొప్పున స్థలాన్ని కేటాయించి ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోందనీ, జర్నలిస్టులకు స్థలాలు కేటాయించి వారి ఫ్యూచర్ను తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈప్రాంత పరిస్థితులు, భూములకు గడిచిన కొంతకాలంగా పెరిగిన ధరలను, మార్కెట్ విలువ తదితర అంశాలను వివరించారు.

డైరెక్టర్ దండ రామకృష్ణ మాట్లాడుతూ హైటెక్ సిటీకి పునాది వేసేనాడు జర్నలిస్టులు జూబ్లీహిల్స్ను దాటి వాహనంలో వెళ్లే పరిస్థితి లేదని, గోపన్పల్లిలో ఇళ్లస్థలాలు ఇచ్చేనాటి పరిస్థితులను, జూబ్లీహిల్స్లో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు విలువ పెరుగుతుందని తెలియక అమ్ముకున్న సందర్భాలను వివరించారు. ఫ్యూచర్ సిటీ జర్నలిస్టుల భవిష్యత్తును మార్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఇళ్ల స్థలాలు ఇదే ప్రాంతంలో ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటను జర్నలిస్టులుగా స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నోఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వీలైనంత త్వరగా ఇళ్లస్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ పత్రికలు, మీడియా ఛానళ్లకు చెందిన ప్రతినిధులు వందలాదిగా హాజరైయ్యారు.


