
మార్చి 24 నుండి అమలులోకి రానున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు
మార్చి 25 మరియు మార్చి 30వ తారీఖుల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2025 మార్చి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం సోమవారం( మార్చి 24) నుంచి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరుగుతుంది.
అయితే ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 25వ తారీఖున మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. ఈ కారణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనం కొరకు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని భక్తుల స్పష్టత కొరకు మరోసారి తెలియజేయడమైనది.
అదేవిధంగా ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించబడతాయని కూడా టీటీడీ గతంలోనే స్పష్టం చేసింది.
అయితే మార్చి 30వ తారీఖున ఆదివారంనాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మార్చి 29వ తారీఖున శనివారం నాడు ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని మరోసారి టీటీడీ స్పష్టం చేస్తోంది.