
ఇంజనీర్లకు ప్రమోషన్లు, పోస్టింగ్ లపై హర్షం
ప్రజాభవన్లో భట్టిని కలిసిన రత్నాకర్ రావు, సదానందం
హైదరాబాద్, మే 5, 2025: తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖలో 2012 బ్యాచ్‌కు చెందిన 209 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల హోదాలో పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని ప్రజాభవన్‌లో టీజీపీఈఏ అధ్యక్షుడు పీ. రత్నాకర్ రావు, కార్యదర్శి పీ. సదానందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత 15 ఏళ్లలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పదోన్నతులు జరగడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ జాతికి అంకితం చేసే కార్యక్రమానికి అనుగుణంగా ఈ పదోన్నతులు జరిగినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రత్నాకర్ రావు, సదానందం లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో గత యాసంగి సీజన్‌లో గరిష్ఠంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా విజయవంతంగా సరఫరా చేసినట్లు వెల్లడించారు.
వేసవి కాలంలో అధిక విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో, జెన్కో సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీలు కృష్ణ భాస్కర్, ముషారఫ్, వరుణ్ రెడ్డి నాయకత్వంలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజీపీఈఏ నాయకులు, ఇంజనీర్లు పాల్గొని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
