
డేంజర్ జోన్‌లో తెలంగాణలో ఆడపిల్లల సంఖ్య
ఆడపిల్లల సంఖ్య ఆందోళనకరం
కేంద్ర హోం శాఖ రిపోర్టు
హైదరాబాద్, మే 11, 2025: తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం తాజా రిపోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఆడ శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, ఇది భవిష్యత్తులో సామాజిక సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదిక హెచ్చరించింది.
రిపోర్టు ప్రకారం, 2019లో ప్రతి 1000 మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు జన్మించగా, 2021 నాటికి ఈ సంఖ్య 922కు పడిపోయింది. ఈ తగ్గుదల రాష్ట్రంలో లింగ నిష్పత్తి అసమతుల్యతను సూచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 శిశువులు జన్మించగా, పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టారు. మొత్తం 6.11 లక్షల జననాల్లో హైదరాబాద్ జిల్లా 95,666 జననాలతో అగ్రస్థానంలో నిలిచింది, అతి తక్కువగా ములుగు జిల్లాలో 3,868 జననాలు నమోదయ్యాయి.

మరణాల విషయంలోనూ 2021లో కొవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో మరణాల రేటు 15.4 శాతం పెరిగింది. మొత్తం 2.34 లక్షల మరణాల్లో 1.35 లక్షలు పురుషులు, 98 వేలు మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.08 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.26 లక్షల మరణాలు నమోదయ్యాయి. నవజాత శిశు మరణాల్లో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానంలో, పెద్దపల్లి రెండో స్థానంలో నిలిచాయి. మరణించినవారిలో 76 శాతం మంది 55 ఏళ్లు పైబడిన వారని రిపోర్టు వెల్లడించింది.
ఈ గణాంకాలు తెలంగాణలో లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. ఆడపిల్లల జననాలను ప్రోత్సహించేందుకు, నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
