
రుతుపవనాలు ముందస్తు రాక
వానాకాలం సన్నద్ధతపై సీఎం ఆదేశాలు
హైదరాబాద్, మే 27: ఈ ఏడాది తెలంగాణలో రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు.
ధాన్యం సేకరణలో రికార్డు స్థాయి విజయం
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. గత ఏడాది 42 లక్షల టన్నులతో పోలిస్తే ఈసారి 21.50 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు వెల్లడించారు. రైతులకు 48 గంటల్లో రూ.12,184 కోట్లు చెల్లించినట్లు, 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు పేర్కొన్నారు. మిగిలిన 4-5 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు.
ముందస్తు వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు ఆటంకాలు ఎదురైనప్పటికీ, 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో సేకరణ విజయవంతంగా జరిగిందని, 12 జిల్లాల్లో చిన్నపాటి ఆందోళనలు నమోదైనట్లు సీఎం తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ధాన్యం సేకరణ వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు. రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు, దుష్ప్రచారాలను అరికట్టేందుకు కలెక్టర్లు ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

వానాకాలం సాగుకు సన్నద్ధం
రుతుపవనాలు ముందస్తు రాక, 29 శాతం అధిక వర్షపాతంతో సుభిక్ష వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్ విధించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు.
భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై దృష్టి
గతంలో ధరణి రైతులకు భారంగా మారిన నేపథ్యంలో, కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంగా నిలుస్తుందని సీఎం వెల్లడించారు. ఈ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అమలు చేస్తామని, జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్లకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపిన సీఎం, ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటు, ఉచిత ఇసుక కూపన్ల అందుబాటు, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి కొత్త సాంకేతికతను అనుసరించాలని సూచించారు.
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు సూచనలు
మే 29, 30 తేదీల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించి, ధాన్యం సేకరణ, భూభారతి, వానాకాలం సాగు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, జూన్ 1 నాటికి అన్ని అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
