
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కంచ ఐలయ్య షెపర్డ్ భేటీ
తెలంగాణ కుల గణన, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
న్యూఢిల్లీ, జూలై 24, 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో స్వతంత్ర నిపుణుల కమిటీ వైస్ చైర్మన్, ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కుల గణన సర్వే: సామాజిక న్యాయంలో కీలక దశ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి కుల సర్వే (SEEEPC – Socially, Educationally, Economically and Employment-wise Poor Castes) ద్వారా బీసీ కులాలు, ఉపకులాల స్థితిగతులను విశ్లేషించి, సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సర్వే ఆధారంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు ప్రస్తుతం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. అదే విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేబినెట్ తీర్మానం చేసి, గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపింది.

42% బీసీ రిజర్వేషన్
దేశ జనాభాలో బీసీల శాతం గణనీయంగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో వారి రిజర్వేషన్ తక్కువగా ఉందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. బీసీల హక్కుల కోసం 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడం సామాజిక న్యాయ పోరాటంలో కీలకమైన దశగా ఆయన అభివర్ణించారు. ఈ సర్వే ద్వారా సేకరించిన ఎంపైరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్ల పెంపును చట్టబద్ధం చేయాలని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన సూచించారు.
రాహుల్ గాంధీ, ఖర్గే స్పందన
సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వే దేశంలో సామాజిక న్యాయం కోసం ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని, ఈ సర్వే ద్వారా ధనం, భూమి, అవకాశాల పంపిణీపై స్పష్టమైన డేటా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల గణనను సరైన రీతిలో నిర్వహించడం లేదని, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కుల గణన కోసం నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రజల ఒత్తిడితోనే కేంద్రంలోని మోదీ సర్కార్ కుల గణనకు అంగీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్ కార్యాచరణ
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కుల గణన సర్వే విధానం, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకుని బీసీల సాధికారత కోసం చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి ఎంపీలకు ఈ సర్వే ఫలితాలను వివరించి, జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
)
ప్రొఫెసర్ కంచ ఐలయ్య సూచనలు
ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. బీసీ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం జరిగింది. వారి అభివృద్ధికి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా ఒక మోడల్‌గా నిలిచిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి సర్వేలు చేపట్టాలని ఆయన సూచించారు.
