
తిరుపతి, జులై 26,2025 : తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులు, స్థానికులలో భయాందోళనలను రేకెత్తించింది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అలిపిరి జూ పార్క్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసేందుకు పొంచి ఉంది. అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటనను వెనుకే వస్తున్న కారులోని ప్రయాణికులు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు, ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అదే రోజు అర్ధరాత్రి అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో చిరుత మరోసారి కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. జూ పార్క్ రోడ్డు వెంబడి నిర్మించిన కల్వర్టుల వద్ద ద్విచక్ర వాహనాలను నిలిపి, యువ ప్రేమికులు కబుర్లలో మునిగిపోతుండగా, కొందరు కార్లలో రోడ్డుపై ఆగి ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో చిరుత సంచారం వారిలో భీతిని నింపింది.
గత కొంతకాలంగా తిరుమలలో చిరుతలు తరచూ రోడ్లపై కనిపిస్తున్నాయి. అలిపిరి, జూ పార్క్ రోడ్డు, అన్నమయ్య భవనం సమీపంలో ఇనుప కంచెలను దాటుకుని ఈ జంతువులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో నిఘా ఉంచినప్పటికీ, చిరుతలు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనలతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని అరికట్టేందుకు కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు టీటీడీని కోరుతున్నారు. వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారడంతో, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
