
నల్గొండ బస్‌స్టాండ్‌లో హృదయవిదారక ఘటన: కన్నబిడ్డను వదిలేసిన తల్లి
నల్గొండ, జులై 27: మానవ సంబంధాలను, తల్లితనాన్ని మరిచిపోయేలా చేసిన ఓ దారుణ ఘటన నల్గొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడి కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన 15 నెలల కుమారుడిని బస్‌స్టాండ్‌లో దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థానికులను, ఆర్టీసీ సిబ్బందిని కలచివేసింది.
హైదరాబాద్‌కు చెందిన నవీన (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నల్గొండ పాత బస్తీకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో సందేశాల ద్వారా మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, వివాహేతర సంబంధంగా మార్పు చెందింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను, 15 నెలల కుమారుడు ధనుష్‌ను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంతో ఆమె తన చిన్నారితో కలిసి నల్గొండకు చేరుకుని, ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో బిడ్డను వదిలేసి ప్రియుడితో బైక్‌పై వెళ్లిపోయింది.

బస్‌స్టాండ్‌లో “మమ్మీ” అంటూ ఏడుస్తూ తల్లి కోసం వెతుకుతున్న బాలుడి దృశ్యం అక్కడి ప్రయాణికుల గుండెలను కలచివేసింది. రెండేళ్ల చిన్నారి బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే నల్గొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సైదులు గౌడ్ నేతృత్వంలోని పోలీసు బృందం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మహిళను, ఆమె ప్రియుడిని గుర్తించింది.
పోలీసులు బాలుడి తండ్రిని సంప్రదించి, బిడ్డను ఆయనకు అప్పగించారు. మహిళ, ఆమె ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన సమాజంలో మానవత్వం, కుటుంబ సంబంధాలపై తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికలపై ఏర్పడే సంబంధాలు కొన్నిసార్లు కుటుంబ విలువలను, మానవీయతను ఎలా కాలరాస్తున్నాయన్నది ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

“తల్లి బిడ్డను వదిలేసి వెళ్లడం హృదయవిదారకం. సమాజంలో సంబంధాల విలువను మరచిపోతున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది,” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవ సంబంధాలపై ఆలోచింపజేస్తూ, సోషల్ మీడియా ప్రభావంపై జాగ్రత్తగా ఉండాలని సమాజానికి హెచ్చరికగా నిలిచింది.
