
వరంగల్, జులై 29: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కుండె చైతన్య మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న చైతన్య, తన విద్యాబోధన మరియు సామాజిక సేవలతో ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
చైతన్య తన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన చర్యలు, ఐదో తరగతి విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించేలా అత్యుత్తమ బోధన అందించడం, ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి కృషిని గుర్తించిన స్పూర్తి సర్వీసెస్ సొసైటీ, ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చైతన్యకు అవార్డును అందజేయనున్నట్లు స్పూర్తి సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ వెల్లడించారు.
ఈ జాతీయ స్థాయి అవార్డుకు చైతన్య ఎంపిక కావడంపై తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. చైతన్య సాధించిన ఈ గౌరవం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
