
డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం
కళాసాహిత్య ప్రియులకు శుభవార్త!
హైదరాబాద్, ఆగస్టు 01: ప్రఖ్యాత కాంటెంపరరీ ఆర్టిస్ట్ కట్టకూరి రవి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆగస్టు 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్‌లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
బుధవారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసిన కట్టకూరి రవి, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రవి, డిప్యూటీ సీఎంకు మహాత్మాగాంధీ పెయింటింగ్‌ను బహుకరించారు.

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన కట్టకూరి రవి, వృత్తిరీత్యా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా, మలేషియా, స్విట్జర్లాండ్, గ్రీస్, బంగ్లాదేశ్‌తో సహా 12కి పైగా దేశాల్లో ఆర్ట్ ప్రదర్శనలు నిర్వహించిన అనుభవం ఉన్న రవి, భారతీయ కళాసంస్కృతి, మహిళల కట్టుబొట్టు, వస్త్రధారణ, అలంకరణలను తన పెయింటింగ్స్ ద్వారా ఆవిష్కరిస్తున్నారు. 2008లో చైనాలో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో భారత్ నుంచి ఎంపికైన ఆరుగురు కళాకారుల్లో రవి ఒకరని తెలిపారు.
దిల్లీలోని లలిత కళా అకాడమీలో శాశ్వత సభ్యుడైన రవి, ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. గత 25 ఏళ్లుగా కళారంగంలో విశేష కృషి చేస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ఏడు దేశాల్లో ఫైన్ ఆర్ట్స్‌పై ఉపన్యాసాలు ఇచ్చిన రవి, ఆగస్టు 9 నుంచి 14 వరకు చైన్నైలో జరిగే మద్రాస్ ఆర్ట్ వీకెండ్‌లోనూ పాల్గొననున్నారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, కట్టకూరి రవి కళాసేవలను ప్రశంసిస్తూ, హైదరాబాద్‌లో గొప్ప కళాకారుడిగా ఉన్నత స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాప్రియులకు విజ్ఞానవంతమైన అనుభవాన్ని అందించనుంది.
