
హైదరాబాద్, ఆగస్టు 19: నగరంలోని బండ్లగూడలో వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగలడంతో సంభవించిన విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. గాయపడిన అఖిల్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో విద్యుత్ షాక్ తీవ్రత ఎంతగా ఉందంటే, ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని సురక్షితంగా తరలించారు.
రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఇటీవల జరిగిన విషాద ఘటన మరువకముందే ఈ ఘటన నగరవాసులను కలిచివేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హై టెన్షన్ వైర్ల సమీపంలో ఊరేగింపులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
