
గురుపూజోత్సవం-2025లో సంచలన ప్రకటనలు!”
విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుంది
విద్యాశాఖలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
“నాకు స్వార్థం ఉంది. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే నేను కూడా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అలాగని ‘నేను ఫామ్ హౌస్‌లో పడుకుంటాను… మళ్లీ ముఖ్యమంత్రిగా చేయండి’ అని నేను అడగడం లేదు. మీతో పాటే నేను కూడా కష్టపడతాను” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గురుపూజోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు.
విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటే నాణ్యమైన విద్యను అందిస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. ప్రతి సంవత్సరం 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేలా ప్రోత్సహిద్దామని ఆయన అన్నారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని వ్యాఖ్యానించారు. నేను కూడా విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని హామీ ఇచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ముఖ్యమంత్రి అన్నారు. చాలాచోట్ల కేజీ టు పీజీ ఉచిత విద్య అందడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.
పదేళ్లుగా అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను సరిచేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. విద్యా శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. “సాధారణంగా ముఖ్యమంత్రులు రెవెన్యూ, ఆర్థిక, నీటిపారుదల శాఖలను తమ దగ్గరే ఉంచుకుంటారు. కానీ నేను మీ సోదరుడిగా విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నాను” అని ఆయన అన్నారు. తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టుతూ, విద్యా శాఖలోని సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.


పదేళ్లలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని, కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు కాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడుతూ, ఆనాడు పల్లెల్లో ఉద్యమ నినాదాలను చేరవేసింది ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. మునుపటి ప్రభుత్వం పదేళ్లుగా టీచర్ల బదిలీలు, నియామకాలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. “మా ప్రభుత్వం ఏర్పడిన 55 రోజుల్లోనే 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశాం” అని ఆయన పేర్కొన్నారు. 0
మునుపటి పాలకులు విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చి, యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల వైభవాన్ని కోల్పోయేలా చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు అవసరమని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులని రేవంత్ రెడ్డి అన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ప్రతి ఏటా 130 కోట్ల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.



గతంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక 3 లక్షలు పెరిగిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణకు నూతన విద్యా విధానం అవసరమని, పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ విధానం ఉండాలని అన్నారు. దీనికోసం కమిటీని నియమించామని తెలిపారు.
విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించాలని సూచించిన ముఖ్యమంత్రి, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్స్ యూనివర్శిటీ, 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటును ప్రస్తావించారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి తప్పుదారుల్లో పడకుండా చూడాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

“విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నా” అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను పునర్నిర్మించేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
