
చేతికి వచ్చిన పంట వానపాలు
ప్రధానంగా 12 జిల్లాలు 179 మండలాల్లో పంటలు ఆగం
2.53లక్షల మంది రైతుల పంట తెర్లు
వరి, పత్తితో పాటు దెబ్బతిన్న మిరప, మక్క పంటలు
2.82లక్షల ఎకరాల్లో వరి..1.51లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీగా పంటనష్టం
వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా
హైదరాబాద్, అక్టోబర్ 30: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వానాకాలం పంటలన్నీ నీళ్లపాలై ఆగమైనయ్. వానాకాలం సీజన్ ముగిసి పంటలన్నీ చేతికి వస్తున్న దశలో తుఫాన్ ఎఫెక్ట్ తో పంటలున్నీ తెర్లయ్యాయి. కోత దశలో ఉన్న వరి పొలాలు, విరబూసిన పత్తి ఏరే దశలో ఉండగా.. మిరప చేన్లు కాత దశలో ఉన్నాయి. మక్కలు, వేరుశనగ, కూరగాయ పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన వరి, పత్తి పంటలు భారీగా దెబ్బతినడంతో రైతుల ఆశలన్నీ అడిఆశాలైయ్యాయి. ఆరుగాలం పండించిన పంటలు వానలకు తెర్లవడంతో రైతులు కన్నీరు మున్నీరైయ్యారు. తుఫాన్ కారణ:గా తమ నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్లయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. తాజాగా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక అందించారు. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో వరద నీళ్లు పొలాల్లోకి చేరాయి. పంటల్లో ప్రధానంగా వరి, పత్తి, మిరప, మక్క పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 179 మండలాల్లో 2,53,033మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయశాఖను పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని సర్వే చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, సూర్యపేట, నల్లగొండ, హన్మకొండ, నాగర్కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ తదితర 12జిల్లాల్లోని 179 మండలాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ తేల్చింది.
ఉమ్మడి వరంగల్ జల్లాలో భారీగా పంట నష్టం..
ఈ ఏడాది 1.33కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. 67.30లక్షల ఎకరాల్లో వరి, 45.94 లక్షల ఎకరాల్లో పత్తి, 4.91 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా ఈ పంటలన్నీ చివరిదశలోనే ఉన్నాయి. తాజాగా మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు నీట మునిగాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికంగా 1,30,200 ఎకరాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఆతరువాత ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాల్లో పంట నష్టం జరుగగా, అదేవిధంగా నల్లగొండ జిల్లాలోనూ 52,071 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో తేల్చింది.

2.82లక్షల ఎకరాల్లో వరికి దెబ్బ
ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 67.30లక్షల ఎకరాల్లో వరి పొలాలు సాగైయ్యాయి. తాజాగా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో వరిపొలాలన్నీ నేలవాలాయి.
ముందస్తు నాట్లు వేసిన జిల్లాల్లో పంట చేతికి రాగా కల్లాల్లో కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. చివరి దశలో ఉన్న వరంగల్, సూర్యపేట్, ఖమ్మం, నల్గగొండ, జరగాం, మహబూబాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వరి పొలాలు నేలవాలాయి. వరంగల్ జిల్లాలో 70700 ఎకరాల్లో వరిపొలాలకు నష్టం జరుగగా సూర్యపేట్ జిల్లాలో 48444 ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 36893 ఎకరాల్లో , హన్మకొండ జిల్లాలో 33348 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 28055 ఎకరాల్లో , జనగాం జిల్లాలో 18320 ఎకరాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 16617 ఎకరాల్లో, కరీంనగర్ జిల్లాలో 15987 ఎకరాల్లో, నాగర్ కర్నూల్ జిల్లాలో 10585వరికి నష్టం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2,82,379 ఎకరాల్లో వరిపొలాలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు.

1.51లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి పంట
ఈయేడు రాష్ట్రంలో 45.94 లక్షల ఎకరాల్లో సాగైంది. కాగా మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో అత్యధికంగా 55వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిళ్లగా నల్లగొండ జిల్లాలో 23911 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ఆతరువాత ఖమ్మం జిల్లాలో 22574 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగినంది. అదే విధంగా నాగర్కర్నూల్ జిల్లాలో 18647 ఎకరాల్లో పత్తి పంటదెబ్బతిన్నది. మహబూబాబాద్ జిల్లాలో 8752 ఎకరాలు, జనగాం జిల్లాలో 6445 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 7562 ఎకరాల్లో పత్తి పంటపై తీవ్రంగా నష్టం జరిగింది. విరబూసినపత్తి చేన్లు నీట మునిగి పత్తిపూతంగా నాని పోయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1,51,707 ఎకరాల్లో ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
మిగతా పంటలు ఇలా
వానాకాలంలో సాగైన మిగతా పంటల్లో ప్రధానంగా మక్కజొన్న 4963 ఎకరాలు, మిరప3613 ఎకరాలు, వేరుశనగ 2674 ఎకరాలు, పప్పుదినుసులు 1228 ఎకరాలు, కూరగాయల పంటలు 1300 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరంగల్ జిల్లాలోనే హార్టీకల్చర్ క్రాప్స్ కు నష్టం జరిగడం గమనార్హం.

నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం…మంత్రి తుమ్మల
మొంథా తుఫాన్ ప్రభావంతో నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఎకరాకు ఎంత పంట నష్ట పరిహారం ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే ప్రాథమిక అంచనాతో ప్రభుత్వానికి పంట నష్టం నివేదిక అందిందనీ, పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
