ఫైర్ NOC సస్పెండ్బంజారాహిల్స్ భవనంలో ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు
అనుమతులు లేకుండా పైభాగంలో రెస్టారెంట్ నిర్వహణపై అభ్యంతరం
నిబంధనలు అమలు చేసే వరకు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం
నగరవ్యాప్తంగా వాణిజ్య భవనాలపై ఫైర్ శాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగింపు
హైదరాబాద్, జూన్ 13: నగరంలోని ప్రముఖ నిలోఫర్ రెస్టారెంట్‌కు అగ్నిమాపక శాఖ భారీ షాక్ ఇచ్చింది. బంజారాహిల్స్‌లో ఉన్న నిలోఫర్ భవనంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన అధికారులు, భవనానికి జారీ చేసిన ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ను తక్షణమే సస్పెండ్ చేశారు.

అగ్నిమాపక శాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భవనం పైభాగంలో అవసరమైన అనుమతులు లేకుండానే రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా భవనంలో అమలు చేయాల్సిన ఫైర్ సేఫ్టీ ప్రమాణాల్లో పలు లోపాలు ఉన్నట్లు అధికారులు తేల్చినట్లు తెలిసింది.
తనిఖీల సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు సురక్షితంగా బయటపడేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, అగ్నిప్రమాద నియంత్రణ వ్యవస్థలు, సంబంధిత అనుమతుల పత్రాలకు సంబంధించిన అంశాల్లో కూడా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు నిలోఫర్ భవనానికి గతంలో జారీ చేసిన ఫైర్ NOCను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలో ఉన్న లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఎలాంటి సడలింపులు ఉండబోవని స్పష్టం చేశారు.
ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అగ్నిమాపక శాఖ అధికారులు, నగరంలోని ఇతర వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్లలో కూడా విస్తృత స్థాయిలో తనిఖీలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల రద్దీ అధికంగా ఉండే వాణిజ్య భవనాల్లో భద్రతా ప్రమాణాల అమలు ఎంత కీలకమో నిలోఫర్ ఘటన మరోసారి చాటిచెప్పింది. అగ్నిమాపక శాఖ చర్యలపై రెస్టారెంట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
