హైదరాబాద్, జూలై 11: తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) పలు కఠిన షరతులు, ఆంక్షలతో కూడిన పంపిణీ లైసెన్స్‌ను మంజూరు చేసింది. రైతుల ప్రయోజనాలు, విద్యుత్ ఉద్యోగుల హక్కులు, వినియోగదారుల భద్రతకు భంగం కలగకుండా ప్రత్యేక నిబంధనలను కమిషన్ విధించింది.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయరాదని, విద్యుత్ ఉద్యోగుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని, వినియోగదారుల విద్యుత్ భద్రతకు పూర్తి రక్షణ కల్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.

లైసెన్స్ మంజూరుకు ముందు నిర్వహించిన బహిరంగ విచారణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యుత్ ఉద్యోగులు, నిపుణులు, ఇతర వర్గాల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 20 ప్రధాన అభ్యంతరాలు నమోదుకాగా, వాటిలో 10 అభ్యంతరాలను పూర్తిగా సమర్థించింది. మరో ఐదు అభ్యంతరాలను పాక్షికంగా ఆమోదించగా, మిగిలిన ఐదింటిని తిరస్కరించింది.

లైసెన్స్ జారీ అయిన తేదీ నుంచి నాలుగు నెలల వ్యవధిలో ఏడు షరతులను తప్పనిసరిగా అమలు చేయాలని, అనంతరం మరో నాలుగు నెలల్లో మరో ఏడు షరతులను అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది.

అలాగే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPAs), వ్యాపార ప్రణాళిక (బిజినెస్ ప్లాన్)ను మూడు నెలల్లో కమిషన్‌కు సమర్పించాలని TGRPDCL యాజమాన్యాన్ని ఆదేశించింది. TGSPDCL, TGNPDCL, TGRPDCL మధ్య అవగాహన ఒప్పందాలు (MoUs) 65 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది.

బల్క్ సప్లై ఏర్పాట్లు, మాక్ డ్రిల్ నిర్వహణను తప్పనిసరి చేసిన కమిషన్, విద్యుత్ చట్టంలోని సెక్షన్లు 132(4), 131(5) ప్రకారం ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ స్కీమ్ అమలు చేయాలని స్పష్టం చేసింది.

రైతులు కోరిన వెంటనే విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగరాదని, సేవలలో లోటుపాట్లు ఉండకూడదని కమిషన్ పేర్కొంది. విద్యుత్ సబ్సిడీ, రిటైల్ టారిఫ్, ఎస్‌ఎల్‌డీసీ షెడ్యూలింగ్, గ్రిడ్ కనెక్టివిటీ వంటి అంశాలపై స్పష్టమైన విధానాలను అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text