జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ..

వజ్రాభరణాలు మాయం!

సంపన్నుల ఇళ్లే టార్గెట్‌.. వరుసగా మూడు ఇళ్లలోకి చొరబడేందుకు యత్నం
వ్యాపారి ఇంట్లో రూ.లక్షల విలువైన వజ్ర, బంగారు ఆభరణాలు అపహరణ

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వరుస చోరీయత్నాలు కలకలం రేపాయి. సంపన్నుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ఓ అగంతకుడు పక్కపక్కనే ఉన్న మూడు ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. చివరకు ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి కప్‌బోర్డులో భద్రపరిచిన విలువైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలను అపహరించాడు. యజమాని నిద్రలేవడంతో మరో ఇంట్లో చోరీకి చేసిన ప్రయత్నాన్ని విరమించుకుని పరారయ్యాడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ నంబర్‌ 153లోకి చొరబడేందుకు అగంతకుడు తొలుత ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అనంతరం పక్కనే ఉన్న ప్లాట్‌ నంబర్‌ 154లో నివసించే వ్యాపారి షీతల్‌ బాంగర్‌ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అయితే ఇంటి యజమాని నిద్రలేవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ తర్వాత ప్లాట్‌ నంబర్‌ 147లో నివసించే మరో వ్యాపారి శైలేందర్‌ సింగ్‌ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇంట్లోకి చొరబడిన అగంతకుడు కప్‌బోర్డులో భద్రపరిచిన విలువైన ఆభరణాలను అపహరించాడు. వీటిలో ఎమరాల్డ్‌ వజ్రపు ఉంగరం, రెండు బ్రాస్లెట్లు, నెక్లెస్‌, చెవి కమ్మలు ఉన్నాయి. ఎమరాల్డ్‌ నెక్లెస్‌, మరో బంగారు నెక్లెస్‌తో పాటు మరికొన్ని ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని శైలేందర్‌ సింగ్‌ సతీమణి నీలూ కౌర్‌ గుర్తించారు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు షీతల్‌ బాంగర్‌ ఫిర్యాదుపైనా పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు.

సమాచారం అందుకున్న క్రైం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా ఇళ్ల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఫుటేజీలో లభించిన ఆధారాల ఆధారంగా అగంతకుడి కోసం గాలిస్తున్నారు.

ఒకే ప్రాంతంలో వరుసగా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీయత్నాలు జరగడం జూబ్లీహిల్స్‌ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? మరెవరైనా సహకరించారా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text