
–సంచలనంగా మారిన డీహెచ్ వ్యాఖ్యలు
–వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీహెచ్
–తలైవార్ డైలాగ్‌ను కేసీఆర్‌కు అన్వయం
–కేసీఆర్‌కు మరోసారి మద్దతివ్వాలన్న డీహెచ్
–సంచలనంగా మారిన కామెంట్స్
–పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇలాంటి కామెంట్స్..!
–డీహెచ్‌పై ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్, ఆగస్టు11:
కుక్క మొరగకుండా వుండదు… నోరు విమర్శించకుండా వుండదు… ఇవి రెండూ ఉండని ఊరే వుండదు.. మనం మాత్రం మన పని చూసుకుంటూ పోతూ…నే ఉండాలి..అంటూ ఇటీవల జైలర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్..తమిళ అభిమానుల- తలైవార్ రజినీకాంత్ డైలాగ్ చెప్పారు….ఇదే డైలాగ్‌ను హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు సీఎం కేసీఆర్‌కు అన్వయించి చెబుతూ మరోసారి సెన్సేషన్ కామెంట్లు చేశారు. మరో రెండు మూడేళ్లలో దేశంలో తెలంగాణ నంబర్‌గా నిలువడానికి కేసీఆర్‌కు మరోసారి మద్దతివ్వాలని డీహెచ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు.

“తెలంగాణ ఉద్యమ సమయంలో మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు… ఈ రెండూ జరగని ఊరు కానీ, పట్టణం లేదు… అయినా కేసీఆర్ పట్టుదలతో తెలంగాణను సాధించారు” అంటూ డీహెచ్ డాక్టర్ గడల మరోసారి రగడ సృష్టించారు.

శుక్రవారం కోఠిలోని హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన డీహెచ్ ఇలాంటి హాట్ కామెంట్‌లు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే ఎంతోమంది కించపరిచేలా వ్యవహరించారని ఆయన గుర్తుచేశారు. స్వరాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమించి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలలను సాకారం చేశారని అన్నారు. వందల మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేశాయని గుర్తు చేశారు. అయినా ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో కోసం నిత్యం శ్రమించారని… ఇతర రాజకీయ పార్టీల నేతలు అవాకులు చవాకులు పేల్చినా రాష్ట్ర సాధన కోసం వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు.
ప్రతీ ఒక్కరు కేసీఆర్ బాటలో సాగాలని..బంగారు తెలంగాణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ చివరి దశలో ఉన్నదని, దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని అన్నారు. పిల్లల భవిష్యత్ నాశనం కాకూడదంటే సీఎంగా కేసీఆర్ మాత్రమే ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. స్వరాష్ట్రంలో ప్రజలంతా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని కొనియాడారు. ప్రగతి, అభివృద్ధితో పరుగులు పెడుతున్నాయన్నారు. దీన్ని కాపాడుకోవడానికి మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. మరో రెండు మూడేళ్లలో దేశంలోన తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా సాధించుకుంటామని అన్నారు.
రాష్ట్రం సల్లగా ఉండాలంటే కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆయనకు గొప్ప విజనరీ ఉన్నదని, అది రాజకీయ నాయకులకెవ్వరికీ లేదన్నారు. వంద ఏళ్ల వరకు కేసీఆర్ లాంటి నాయకుడు పుట్టడని జోస్యం చెప్పారు. ఆరు నెలలు ఓపిక పట్టండి ..ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కేవలం ..సమయం సందర్భం, ఓపిక ఈ మూడు ఉండాలనికోరారు.

వివాదాస్పదంగా డీహెచ్ వ్యాఖ్యలు
గత కొంత కాలంలో హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కొత్తగూడెంతో పాటు హైదరాబాద్ లోని పలు సభలు, మీటింగ్ లో సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. గతంలోనూ కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదంలో ఇరుక్కున్నారు. గడల శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. గవర్నమెంట్ ఆఫీసర్ హోదాలోనే టిక్కెట్ లభిస్తే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని డీహెచ్ చేసిన ఓపెన్ స్టేట్‌మెంట్‌లు కాంట్రవర్సీగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు డీహెచ్ ప్రకటనలను ఖండించాయి. తాజాగా కేసీఆర్‌కు అండగా ఉండాలనీ పరోక్షంగా బీఆర్ఎస్ కు అధికారం రావడానికి సహకరించాలనే సంకేతాన్ని ఇస్తూ గులాబీ నేత తరహాలో మాట్లాడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.