
– డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సీఎస్ శాంతి కుమారి హామీ
– సెక్రటేరియట్ లో సీఎస్ ను కలిసిన డిజేహెచ్ఎస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్, సెప్టెంబరు 30
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు విషయంలో తన వంతు కృషి చేస్తానని, ఆ విషయాన్ని తన పరిశీలనలోకి తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హామీ ఇచ్చారు. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) ప్రతినిధుల బృందం శనివారం సెక్రటేరియట్లో సీఎస్ ను కలిసింది. సీఎస్ ను కలిసిన వారిలో సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, ట్రెజరర్ సిహెచ్ అయ్యప్ప, డైరక్టర్లు దండా రామకృష్ణ, డి.కుమార్, సభ్యులు శ్రీలత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జర్నలిస్టుల అంశం చర్చకు వస్తే తాను తప్పకుండా ప్రభుత్వం ముందు పరిశీలనలో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డెక్కన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఆమెకు మెమోరాండం అందించారు. “డీజేహెచ్ఎస్‘ సభ్యులకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయించాలని కోరారు. బడుగులు, బలహీనవర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో విజయవంతంగా ముందుకెళ్తుందని మెమోరాండంలో పేర్కొన్నారు. జర్నలిస్టుల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. కోవిడ్-19 వంటి విపత్కర సమయంలోనూ జర్నలిస్టులకు అండగా నిలిచి, ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం తెలంగాణ మినహా దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల స్వప్నం సొంతిల్లు. ఈ కలను నిజం చేసే విశాల హృదయం ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉందని మేము విశ్వసిస్తున్నారు. జర్నలిస్టుల సొంతింటి కల ఈ ప్రభుత్వం ద్వారా సాకారమవుతుందని, అందుకు మేమంతా మీకు కృతజ్ఞులమవుతామని వినయపూర్వకంగా తెలియజేస్తున్నామన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా రాజేం ద్రనగర్ మండలం బుద్వేల్ పరిధిలో జర్నలిస్టుల కోసం నివాస గృహాల సముదాయాలు నిర్మించి ఇవ్వాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రెస్ అకాడమీ, జర్నలిస్టు సంఘాల నేతలతో ఆలోచనను పంచుకోవడాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర రాజధాని కేంద్రంగా హైదరాబాద్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న డీజేహెచ్ఎస్ సభ్యులకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాలని అభ్యర్థిస్తున్నామని వారు సీఎస్ ను కోరారు.