
బీసీల పై కాంగ్రెస్ వరాల హామీలు జల్లు
కామారెడ్డి సభలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్
రిజర్వేషన్ 42శాతానికి పెంపు
ఐదేళ్లలో రూ.లక్షకోట్ల బీసీ సబ్ ప్లాన్
ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పను
కామారెడ్డి, నవంబరు 10
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీసీలకు 23శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ప్రకటించిం బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించింది. మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించింది. ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్షకోట్లు బీసీ సంక్షేమానికి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పూచీ కత్తు లేకుండా రూ.10లక్షల రుణాలు ఇస్తామనీ, పేద వర్గాలకు ఫీజు రియెంబర్స్ ర్యాంకుతో సంబంధం లేకుండా ఇస్తామంటూ బీసీ వర్గాలపై వరాల హామీలు గుప్పించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఓటర్లను అమితంగా అకట్టుకునే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రిజర్వేషన్లు
- కుల గణన, బీసీ కమీషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు.
- కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ.
- ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్.
నిధులు
- బీసీ సబ్ ప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు.
- బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు.
సంక్షేమం
- ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్మేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
- అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు
- అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. బీసీ ఐక్యత భవన్ లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు.
విద్య
- ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల.
- రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంక్‌తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్
చేతి వృత్తులకు సాయం
- “వృత్తి బజార్” పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత.
- గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తింపు.
- బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
వివిధ సామాజిక వర్గాలకు హామీలు
ముదిరాజ్:
- G.O.Ms.No. dt. 19/02/2009 . పునరుద్దరణ, ముదిరాజ్, ముత్రాసు, తెనుగొళ్ల సామాజిక వర్గాలను BC-D నుండి BC-A లోకి చేర్చడం.
గంగపుత్ర:
- మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్కు ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు.
గొల్ల కురుమలు:
- అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ.
గౌడ్:
- ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ.
- మద్యం షాపుల లైసెన్సులలో గౌడ్లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 15% నుంచి 25%కి పెంపు.
- జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగాం జిల్లాగా పేరు మార్పు.
మున్నూరు కాపు:
- తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ.
పద్మశాలి:
- జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు.
- పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ.
విశ్వకర్మ:
- మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు.
- పట్టణ ప్రాంతాల్లో షాప్ల ఏర్పాటుకు భూమి కేటాయింపు.
రజక:
- రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు.
- రాష్ట్ర వ్యాప్తంగా ధోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు




