
మారిన రాజకీయ సామాజిక సమీకరణలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
ఖమ్మం లోక్‌సభ సీటుపై వీడనున్న ఉత్కంఠ
హైదారాబాద్, ఏప్రిల్ 15
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాలు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రకటిస్తున్న క్రమంలో… మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి.ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఖమ్మం లోక్‌సభ సీటుపై పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. యావత్ తెలంగాణ రాజకీయాలను శాసించే ఖమ్మం స్థానంపై అధికార పార్టీలో నేతలు పోటీ చేసేందకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షి నేతృత్వంలో ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే ఈ స్థానంపై కన్నేసిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో… తాజాగా అనూహ్యంగా ఎవరూ ఊహించనిరీతిలో ముదిగొండ మండలం పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పొదిల రవికుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఇదే మండలం వెంకటాపురంకు చెందిన రాయల నాగేశ్వరరావు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే… జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులకు రవికుమార్ అనుచరుడే. ముఖ్యంగా వివాదరహితుడు. అన్ని రాజకీయ పార్టీలతో కూడా మంచి సత్ససంబంధాలు కలిగిన ఉన్న నేత. గతంలో తన తల్లి ఏకగ్రీవంగా పండ్రేగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికై సేవలందించారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని తనకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పొదిల ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించింది. ఈ విషయాన్ని సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే దృష్టికి కూడా సీఎం తీసుకెళ్లడంతో… రవికుమార్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే… 12 జనరల్ సీట్లలో 6 సీట్లు రెడ్డీలకు ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్‌పీఎస్ లాంటి సంస్థల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క బీసీకి కూడా లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం తప్పుడు సంకేతాలు పంపుతోంది. 50 శాతం పైగా ఉన్న బీసీలకు కనీసం ఒక్క టికెట్ అన్నా ఇవ్వకపోతే… ఆ వర్గాలు దూరమవుతాయన్న భయం పట్టుకుంది. ఆ అపప్రద తొలగించుకునేందుకు బీసీ సామాజిక వర్గం (కాపు) నుంచి రవికుమార్‌కు ఖమ్మం టికెట్
ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇవాళ, రేపో పొదిల రవికుమార్ అభ్యర్థిత్వం అధికారికంగా ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వెల్లడి కావడంతో… బీసీ వర్గాలు, ప్రత్యేకించి కాపు వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యకమవుతోన్నాయి. ఇదొక శుభ సంకేతం అని రవికుమార్ అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కంటే సీనియర్ నేత పొదిల రవికుమార్
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొదిల రవికుమార్‌కు ఖమ్మం అసెంబ్లీ స్థానం ఆశించినప్పటికీ… తృటిలో చేజారిపోయింది. అప్పుడు వజీర్‌సుల్తాన్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి రంగయ్యనాయుడు, ఆ తర్వాత రేణుకాచౌదరికి ముఖ్య అనుచరుడుగా ఎంతో గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో కూడా స్నేహం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా… ప్రత్యేకించి ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రతి గ్రామంలో కూడా పరిచయాలు కలిగి ఉన్న ఆయన… మంచి సౌమ్యుడుగా తలలో నాలుకలా ఉన్నారు. సుధీర్ఘకాలంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ఎంతో సేవ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సౌమ్యడు. ఒకరంగా చెప్పాలంటే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కంటే సీనియర్ నేత. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా ఉన్న దృష్ట్యా… ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం), సీపీఐ బలంగా ఉండటం కూడా పొదిల రవికుమార్‌కు కలిసొచ్చే అంశం. అలాగే, బలమైన కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మద్దతు కూడా ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లెక్కన సంప్రదాయ కాంగ్రెస్, వామపక్షాలు, బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లు గంపగుత్తగా పడి గెలుపు నల్లేరుపై అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.