తెలంగాణ ప్రభుత్వం కొత్త బీమాపై వ్యవసాయశాఖ విప్లవాత్మక నిర్ణయం.-కరువు కారణంగా పంట వేయని రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకం. రైతులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకుంటోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల రైతులు బీమా పరిధిలోకి వస్తారు. గతంలో 10 లక్షలలోపే పంటల బీమాలో ఉండేవారు.పంటల బీమా మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
కరువు లేదా వరదలు తదితర కారణాల వల్ల ఎవరైనా పంటలు సాగు చేయకుంటే అటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలులోకి తెచ్చేందుకు వ్యవసాయశాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంటుంది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో పడ్డారు వ్యవసాయాధికారులు. జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా అందుతుందో… అలాగే పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఉన్న వెసులుబాట్లను వియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పునఃప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పథకం అమలు, మార్గదర్శకాలపై ఇప్పటికే కంపెనీలతోనూ చర్చించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ గోపి అక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అధికారులతోనూ చర్చించారు.
గత ప్రభుత్వంలో ఆనాటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రైతు యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని అనేకమార్లు ప్రతిపాదనలు చేశారు. అయితే అప్పట్లో పథకం మార్గదర్శకాల్లో వెసులుబాటు లేక అమలు కాలేదు. ప్రస్తుతం ఈ పథకంలో మార్పులు జరగడంతో దానికి అనుగుణంగానే రైతు యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్‌గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్‌లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే… 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా… అరెకరాల ఉన్న ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. బీమా పరిధిలోకి 50 లక్షల మంది రైతులు వస్తారని తెలుస్తోంది.రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పధకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. నేరుగా పంటల బీమా చేసుకోవడానికి రైతులు ముందుకు రావడంలేదని భావించి… బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు తప్పనిసరిగా పంటల బీమా చేయించేవారు. అంటే పంట రుణం ఇచ్చేప్పుడే బీమా ప్రీమియాన్ని మినహాయించుకొని మిగతా డబ్బులు రైతులకు ఇచ్చేవారు. 2016 వానాకాలం సీజన్ నుంచి దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి వచ్చింది.
Voice
2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు 7.33 ఎకరాలకు ఫసల్ బీమా యోజన కింద బీమా చేయించగా, 1.34 లక్షల మంది రైతులకు రూ. 111.33 కోట్ల పరిహారం వచ్చింది. 2018–19, 2019–20లో రూ. 960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరు కాగా… అందులో కొంతమంది రైతులకు మాత్రమే దక్కింది. అయితే కేంద్ర పంటల బీమా పథకం వల్ల రైతులకు జరిగే లాభం కంటే బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం జరిగిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొందరు రైతులు కూడా బీమా పథకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం… భారీగా లాభాలు గడిస్తున్నప్పటికీ ప్రీమియం ధరలను బీమా కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. ఈ పథకం కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు రెండు శాతం, పసుపు రైతులు ఐదు శాతం ప్రీమియం చెల్లించారు. పునరుద్దరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం రైతు ప్రీమియం చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హెక్టారుకు ప్రీమియం సొమ్ము రూ. 24,165, మిరపకు అత్యధికంగా రూ. 38,715 ప్రీమియంగా ఖరారు చేశారు. ఇంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై విసుగు చెందారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
విత్తడం నుంచి కోత వరకు పలు విధాలుగా భీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద ఉన్న ప్రాథమిక కవరేజీలో పంట విత్తడం నుండి కోత వరకు దిగుబడి కోల్పోయి నష్టం జరిగే పరిస్థితుల్లోనూ కవర్ చేస్తుంది. కరువు, వరదలు, తెగుళ్లు, వ్యాధుల దాడి, కొండచరియలు విరిగిపడటం, పిడుగు కారణంగా అగ్నిప్రమాదం, తుఫాను, వడగళ్ల వానలో నష్టపోయిన పంటలకు కూడా పరిహారం కల్పిస్తారు.లోటు వర్షపాతం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విత్తనాలు నాటినా మొలకెత్తకుంటే కూడా పరిహారం చెల్లిస్తారు. సాధారణ దిగుబడిలో 50 శాతం కంటే తక్కువగా ఉన్నా బీమా పరిహారం చెల్లిస్తారు. పంట కోత అనంతరం గరిష్టంగా రెండు వారాల వరకు వడగళ్ల వాన, తుఫాను, అకాల వర్షాల కారణంగా పంటకు నష్టం జరిగితే పరిహారం అందుతుంది.అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టానికి కూడా పరిహారం ఉంటుంది.-పంటల బీమాపై రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది