తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ మరో మేనిఫెస్టోని విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆరు గ్యారంటీల హామీలతో ప్రజాక్షేత్రంలో గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అధిక స్థానాలు గెలిచేందుకు మరో కొత్త మేనిఫెస్టోని గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్ మేనిఫెస్టో సభ్యులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ 23 ప్రత్యేక హామీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దానిని తిరిగి వెనక్కి తెస్తామని హామీల్లో పేర్కొంది. 2014 విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావాల్సినవి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మైనింగ్ విశ్వవిద్యాలయం లాంటి వాటిని ఈ ఐదేళ్ల కాలంలోనే నిర్మిస్తామని హామీల్లో ఉంచింది.
2014 విభజన ప్రకారం ఏపీలో కలిసిన తెలంగాణలోని 5 గ్రామాల వల్ల భద్రాచలం అభివృద్ధి జరగట్లేదు. ఆ ఐదు గ్రామాలను మళ్ళీ తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అదే విధంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు మరియు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా తీసుకొస్తామని హామీలో పొందుపరిచింది. నీతి ఆయోగ్, నూతన ఎయిర్పోర్ట్, రామగుండం మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. నాలుగు కొత్త సైనిక్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాల సంఖ్య పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
మెరుగైన వైద్యం అందించేందుకు అధునాతన వైద్య పరిశోధనల చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదు నుండి వెళ్లే పలు జాతీయ మార్గాలలో ఐటీ కారిడారులు ఏర్పాటు చేస్తామని హామీల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ విలువలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రంతో పాటు, హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
గ్రామాల అభివృద్ధికై 73&74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రం నిధులను నేరుగా గ్రామ సర్పంచులకు బదిలీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ అందిస్తామని హామీ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీలను నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అధికారం అందించారు. ఆరు గ్యారంటీలతో పాటు మరో 23 సరికొత్త హామీలతో కూడిన మేనిఫెస్టోతో పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి అధిక స్థానాలు గెలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు కలిసొచ్చినట్లు, ప్రస్తుతం విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి