దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పలు స్థానాల్లో జాతీయ పార్టీలు నేరస్థులను నిల్చోబెడుతున్నాయి. నేరాలు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్న వారిని రాజకీయ పార్టీలు సైతం రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 1352 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో 244 మంది అభ్యర్థులు నేరారోపణలు ఉన్నవారు కావడం విశేషం. రాజకీయాల్లో నేరస్తులను క్రమంగా పెంచి పోషిస్తున్న జాతీయ పార్టీలు దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నాయి.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు నేరం ఆరోపించబడ్డ నేతలకు టికెట్లు ఇచ్చాయి. అందులో ముఖ్యంగా జాతీయ పార్టీలయిన కాంగ్రెస్ నుంచి 26 మంది, బీజేపీ నుంచి 22 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగాపలు పార్టీలనుంచి లోకే సభ ఎన్నికల్లో 1352 మంది పోటీలో ఉండగా వారిలో 172 మంది నేరారోపణలు ఉన్నవారు గమనార్హం. అందులో 38 మంది మహిళలకు సంబందించిన కేసుల్లో ఉన్నవారయితే, ఇద్దరు ఏకంగా మానభంగం కేసుల్లో నేరం ఆరోపించబడ్డవారు ఉండటం మరో విశేషం. 5 మంది మర్డర్ కేసులో, 17 మంది అసభ్యంగా మాట్లాడుతూ నేరం ఆరోపించబడ్డవారు వున్నారు. 24 మంది అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నవారు కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
రాజకీయాల్లోకి నేరాలు చేసి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను పార్టీలోకి రానివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. కానీ పార్టీలే వారికి టికెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. పార్టీల గుర్తుపై పోటీచేసే అభ్యర్థులు, వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు వున్నా, పూర్తి జాబితాను ఆయా పార్టీలకు తెలియజేయాలి. నేర ఆరోపణలు ఉన్న అభ్యర్థులను ప్రజలకు తప్పకుండా చెప్పాలని జాతీయ పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలు తెలిసినప్పుడే ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్లే నిర్ణయించుకుంటారని ధర్మాసనం తెలిపింది.
నేరం ఆరోపించబడ్డ వారిని రాజకీయాల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన్ పిటిషన్ వేసింది. నేరాలు చేసేవారిని పోటీ చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టుకి అధికారం లేదనీ జస్టిస్ దీపక్ మిశ్రా తెలియజేశారు. నేరస్తులను రాజకీయాల్లోకి రాకుండా నిలువరించే శక్తి పార్లమెంటుకే ఉందనీ సుప్రీంకోర్టు సూచించింది. అధికారంలో ఉండి నేరం రుజువు అయి రెండేళ్లు శిక్ష పడితే ఆ అభ్యర్థిని పదవీ నుంచి తొలగించి, ఆపై రాజకీయాల్లో పోటీ చేసేందుకు హక్కు లేకుండా చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. రాజకీయాల్లో క్రమంగా పెరుగుతున్న నేరస్థుల వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి నేరస్థులు గెలిస్తే దేశ భవిష్యత్తు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.