దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. మన దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్సీ, పంచాయతీ లాంటి ఎన్నో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మన దేశ జనాభా ప్రకారం పొలయ్యే ఓటు నమోదు శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఓటు వేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓటర్లలో మార్పు రావట్లేదు. కానీ పలు దేశాల్లో ఓటు వేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి దేశాల్లో ఓటింగ్ శాతం పెరగటం పట్ల అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.
పలు దేశాలు ఓటు వేయడాన్ని తప్పనిసరిగా ప్రకటించాయి. ఓటు వేయకపోతే జరిమాన విధిస్తూ ఓటింగ్ శాతం నమోదయ్యేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు తప్పకుండా వేయాల్సిందే. ప్రస్తుతం ఆ విధానాన్ని 11 దేశాలు అమలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా లో 2.60 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆస్టేలియలో ఓటు వేయకుంటే జరిమానా విధిస్తారు. అందుకే అక్కడి 2022 ఎన్నికల్లో అత్యధికంగా 89.82 శాతం ఓటింగ్ నమోదయింది. బ్రెజిల్ దేశంలో ఓటు వేయకపోతే జరిమానా విధించటమే కాకుండా, 18 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయకపోతే వారి జీతాల్లో కొత్త విధిస్తారు. 2022 బ్రెజిల్ దేశంలో జరిగిన ఎన్నికల్లో79.05 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇండోనేషియాలో ఓటు ఖచ్చితంగా వేయాల్సిందే, అందుకే 2019 ఎన్నికల్లో ఇండోనేషియాలో 81.97 ఓటింగ్ శాతం నమోదయ్యింది. బెల్జియంలో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తూ, నాలుగు ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఓటు హక్కును తొలగిస్తారు. సింగపూరులో ఓటు వేయకపోతే ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగిస్తారు. 21 వయస్సు ఉన్నవారు ఓటు వేసేందుకు సింగపూరులో అర్హులు.
అర్జెంటీనా దేశంలో ఓటు తప్పకుండా వేయాల్సిందే. 112 ఏళ్ల నుంచి ఆ విధానం అమలులో ఉంది. అర్జెంటీనాలో జరిగిన 2023 ఎన్నికల్లో 76.32 శాతం ఓటింగ్ నమోదయింది. పెరూ దేశంలో 75 ఏళ్ళు ఉన్నవారు తప్పా, ఓటు హక్కు ఉన్న మిగతా వయసుగల వారు ఓటు వేయాల్సిందే. లేకుంటే జరిమానా విధిస్తారు. నౌరూ, సమోవా లాంటి దేశాల్లో కూడా ఓటు తప్పకుండా వేయాలనే నిబంధనలు ఉన్నాయి. మన భారతదేశంలో 2019 ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ ఒక్కసారి మినహాయిస్తే ఇప్పటివరకు ఆ స్థాయిలో ఓటింగ్ నమోదు అవ్వలేదు.
మన దేశంలో ఇప్పటివరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరగగా,అందులో 9 సార్లు మాత్రమే 60 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్ని ప్రచారాలు చేసినా ఫలితం కనపడట్లేదు. ఓటు పట్ల ప్రజలలో అవగాహనతో పాటు, భయం కల్పిస్తేగాని ఓటు వేయటానికి కదిలేలా కనిపించట్లేదు. ఓటర్లలో చైతన్యం కల్పించేలా పలు రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికి, గత 70 ఏళ్ల నుంచి ఇప్పటికి మెజారిటీ శాతం ఓట్లు నమోదు కాకపోవడం దేశ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
