ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

0.29%కి పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు

ఇస్లామాబాద్, మే 21

పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దివాళా తీసిన శ్రీలంకను కూడా ధరలు మించిపోయాయి. గోధుమపిండి ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు… చాలా నెలల క్రితమే పాకిస్థాన్ దయనీయస్థితిని ప్రపంచానికి చూపించాయి. అప్పు దొరక్క, ఆదుకునేవారు లేక, గడ్డు పరిస్థితులను ఎలా దాటాలో తెలియక, ప్రజల కనీస అవసరాలు తీర్చే మార్గం లేక రెండేళ్ల నుంచి అల్లాడుతోంది. అయినా సరే…ఆ దేశానికి బుద్ధి రాలేదు. ప్రజల ఆకలి ఎలా తీర్చాలో ఆలోచించడం లేదు. దేశ జీడీపీలో 42శాతానికి సమానమైన అప్పు ఉన్న పాకిస్థాన్ రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా…? అక్షరాలా 18వేల కోట్ల రూపాయలు. పాకిస్థాన్ ఇక ఎప్పటికీ మారదని, ఆ దేశం పరిస్థితి మెరుగుపడే అవకాశాలే లేవని ఈ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో 36.4శాతం పెరిగిన రిటైల్ ధరలు :

రాజకీయ అస్థిరతలు, విదేశీ జోక్యాలు, కీలుబొమ్మ ప్రభుత్వాలు, ఆర్మీ గుత్తాధిపత్యాలు….ఆవిర్భావం నుంచి పాకిస్థాన్ ఎదుర్కొంటున్న సమస్యలివి. మన దాయాది దేశానికి మొన్నమొన్నటిదాకా అందినకాడికి అప్పులిప్పిచ్చిన అమెరికా, చైనా వైఖరి కూడా ఇప్పుడు మారిపోయింది. అమెరికా పూర్తిగా ముఖం చాటేస్తే… చైనా కొద్దికొద్దిగా అప్పుల బాధ్యత నుంచి దూరం జరిగే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు అవసరాలు, రెండు దేశాలు ఉమ్మడి శత్రువుగా చూసే భారత్‌తో వ్యవహారాల దృష్ట్యా చైనా పూర్తిగా పాకిస్థాన్ ఆర్థిక అవసరాలను పట్టించుకోకుండా వదిలేయనప్పటికీ.. గతంలోలా అన్ని సహాయాలూ చేసే పరిస్థితి లేదు. ఇక పాకిస్థాన్ ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శ్రీలంక సంక్షోభం చూసిన తర్వాత ఆసియాలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న దేశం అదేనని భావించారు. కానీ అది నిజం కాదని పాకిస్తాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం రుజువు చేస్తోంది.. రిటైల్ ధరలు పాకిస్థాన్‌లో గత ఏడాదితో పోలిస్తే.. 36.4శాతం పెరిగింది. 1964 తర్వాత పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండడం ఇదే తొలిసారి.

తొలిసారి 21 శాతానికి వడ్డీరేట్లు :

దాదాపు ఏడాదిన్నర నుంచి పాకిస్థాన్‌ది ఇదే దుస్థితి. రోజురోజుకూ పరిస్థితి దిగజారుతోందే తప్ప మెరుగుపడడం లేదు. అన్ని రకాల వస్తువుల ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. IMF నుంచి 6.5బిలియన్ డాలర్ల రుణం పొందేందుకు పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. IMF సాయం అందాలంటే సబ్సిడీలు ఎత్తేయాలి. భారీగా పన్నులు పెంచాలి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ధరల ఒత్తిడితో సతమతమవుతున్న పాకిస్థాన్ 1956 తర్వా తొలిసారి వడ్డీరేట్లను 21 శాతానికి చేర్చింది. దేశంలో ప్రజలు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏడాది క్రితమే గోధుమపిండి ట్రక్కులు పాకిస్థానీయులు పరుగులు తీసిన దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించివేశాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ధరలు పెరగడం తప్ప తగ్గడం ఆ దేశ ప్రజలకు తెలియడం లేదు. ఈ నెల ప్రారంభంలో లీటరు పాలు 210 రూపాయలు, కిలో పిండి 800 రూపాయలు పలికాయి. కిలో బియ్యం ధర రెండు వందల నుంచి 400 మధ్య ఉంది.

పాకిస్థాన్ ఏం చేయాలి..? :

ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఏం చేయాలి..? అవసరం లేని ఖర్చులన్నింటినీ తగ్గించుకోవాలి. నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పొదుపు చర్యలు పాటించాలి. బడ్జెట్ కేటాయింపుల్లో నిత్యావసరాల కేటాయింపులకు పెద్దపీట వేయాలి. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు, ఆందోళన తగ్గించేందుకు వీలైనన్ని చర్యలు తీసుకోవాలి. మరి పాకిస్థాన్ ఏం చేస్తోంది..? అంటే వచ్చే సమాధానం అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని. పాకిస్థాన్ ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టడం లేదని. ఈ అభిప్రాయానికి కారణం పాకిస్థాన్ రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు. ఈ ఏడాది పాక్‌ బడ్జెట్లో రక్షణరంగానికి కేటాయింపులు 15.4శాతం పెంచింది. దీంతో మొత్తం కేటాయింపులు 18వేల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో, పేదరికంతో పాకిస్థాన్ ప్రజలు దయనీయ పరిస్థితులు అనుభవిస్తున్న వేళ.. రక్షణరంగానికి ఈ స్థాయిలో కేటాయింపులు పెంచడంపై అంతర్జాతీయంగానే కాదు.. స్వయంగా పాకిస్థాన్‌లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

0.29 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు :

రాజకీయ అస్థిరతకు తోడు కరోనా ప్రభావం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనంతరం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నప్పటికీ.. పాకిస్థాన్ పరిస్థితి మాత్రం ఒక్కశాతం కూడా మెరుగుపడడం లేదు. మూలిగేనక్కపై తాటిపండు పడిన చందాన గత ఏడాది సంభవించిన వరదలు పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. జీడీపీ వృద్ధిరేటు 5శాతం నుంచి 0.29 శాతానికి పడిపోయింది. అయినా సరే పాకిస్థాన్ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంపైన, బడ్జెట్‌లో రక్షణరంగానికి భారీగా నిధులు కేటాయించి చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనడంపైనా, భారత్ సరిహద్దుల్లో అవసరం లేకపోయినా భారీగా బలగాల్ని మోహరించడంపైనా కోట్లు ఖర్చు పెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text