
ఏఈవో ల సస్పెండ్ అన్యాయం
తప్పు చేయని వారిపై చర్యలు అనైతికం
మహబూబాబాద్ జిల్లా డీఏవోకు సస్పెండైన ఏఈవోల లేఖ
హైదరాబాద్, జూన్ 8:
ఏఈవో ల సస్పెండ్ అన్యాయం
తప్పు చేయని వారిపై చర్యలు అనైతికమని ఏఈవో ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రీన్ మెన్యూర్ సీడ్స్ పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో ఏఈవోలకు ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు..సస్పెండైన ఏఈవోలు అరవింద్, జమున, దీపికలతో కలిసి సంఘం నేతలు మహబూబాబాద్ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం విజ్ఞప్తి చేశారు. ఏఈవోలను అన్యాయంగా సస్పెండ్ చేశారని.. పునర్విచారణ చేపట్టి సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు. మే 18న తొర్రూర్ ఆగ్రోస్-1, పీఏసీఎస్ తొర్రూర్ ఆగ్రోస్-2, ఆగ్రోస్-4 సామవరపుకుంటతండా కేంద్రాలకు 500 క్వింటాళ్ల జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాల స్టాక్ వచ్చిన విషయమే ఏఈవోలను సమాచారమే లేదని, సీడ్ సేల్ పాయింట్ దగ్గర కూడా ఎటువంటి అలాట్‌మెంట్ జరగలేదని వారు పేర్కొన్నారు.

అయితే స్టాక్ వచ్చిందంటూ మే 22న ఏవో కె.సోమకుమార్ తమకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారమిచ్చారని, సేల్ పాయింట్ అలాట్‌మెంట్ చెక్ చూసుకునే లోపే దాదాపు 50 శాతం మేర విత్తనాలు ఆన్‌లైన్‌లోనే అయిపోయాయని తెలిపారు. ఏవో సోమకుమార్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను సేల్‌పాయింట్ వారికి ఇవ్వడంతో.. వారే రైతుల పేరిట ఆన్‌లైన్ పర్మిట్స్ జనరేట్ చేశారని వెల్లడించారు. కాగా, ముగ్గురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులను జారీ చేసారు. మరిపెడ మండలం ఏడీ శోభన్ కావాలని ఏఈవో లను ఇరికించారని వారు ఆరోపించారు. సర్కార్ స్పందించి అనైతికంగా సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద అధికారులు చేసిన తప్పిదాలకు కిందిస్థాయి అధికారులను బలి చేయడం కరెక్ట్ కాదని వారు పేర్కొన్నారు. డైరెక్టర్ తమ నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఈ సందర్భంగా వారు కోరారు.