
హైదరాబాద్, జూన్ 12
తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట ఉంది. దాన్ని 2022 సంవత్సరంలో ప్రచురించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహా మంత్రుల పేర్లు అందులో ఉన్నాయి. తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారినప్పటికీ ఆ ముందుమాట పేజీని అధికారులు అలాగే ఉంచారు. దీనిపై తెలంగాణ కొత్త ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే ఆ పేజీని తొలగించాలని విద్యాశాఖకు హుకుం జారీ చేసింది. దీంతో అధికారులు ఆయా పుస్తకాలను వెనక్కు రప్పిస్తున్నట్లు సమాచారం. అంతేగాక తమ వద్ద ఉన్న పుస్తకాలను పాఠశాలలకు పంపించకూడదని ఆదేశించారు. పంపించిన వాటిల్లో ఆ పేజీని చించివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ప్రారంభమవుతున్న పాఠశాలలకు తాజా పరిణామాల నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ ఆలస్యం కానుంది అనేది నిర్వివాదాంశం. పాఠశాల విద్యాశాఖ అధికారులు పాఠ్యపుస్తకాలలోని ముందుమాట తొలగిస్తే గాని కొత్త విద్యా సంవత్సరం పిల్లలకు పుస్తకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.