హైదరాబాద్, జూన్ 15
జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చైర్మన్ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. తెలంగాణకు కావాల్సిన విద్యుత్ అవసరాల దృష్ట్యా అన్ని రకాల చట్టాలు, నిబందనలు పాటిస్తూ విద్యుత్ కొనుగోళ్లు చేశామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.


బీఆర్ఎస్ పార్టీపై దురుద్దేశంతో నిందలు వేశారని కేసీఆర్ అన్నారు. ఎలాగైనా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణి మీలో కనిపిస్తోంది అంటూ జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. విచారణ కమిషన్ చైర్మన్ గా మీరు ఉండడం సమంజసం కాదంటూ కేసీఆర్ అన్నారు. మీరు కూడా తెలంగాణ బిడ్డే 2014 కు ముందు ఆ తర్వాత తెలంగాణలో కరెంట్ పరిస్థితులు మీకు బాగా తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగు భవిష్యత్తుగా బీఆర్ఎస్ పార్టీ మార్చిందని గుర్తు చేశారు. మా హయాంలో తెలంగాణ ఏం చేసిందో మీరు కూడా చూశారని కేసీఆర్ అన్నారు.తెలంగాణలోని అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చామని కేసీఆర్ అన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఐటీ కంపెనీలను తెలంగాణకు వచ్చేలా ఆకర్షించిందని లేఖలో పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు కేవలం 57 వేల కోట్లు వుంటే 2020 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతులు 2041 లక్షల కోట్లకు పెరిగిందనీ గుర్తు చేశారు. ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయిక ప్రగతి ఎలా పెరిగిందో చూశారు. ఏటా లక్షలాది మోటర్లు కాలిపోవడం బీఆర్ఎస్ హయాంలో నివారించగలిగామని కేసీఆర్ అన్నారు. జనరేటర్లు,ఇన్వర్టర్లు,కన్వర్టర్లు మాయమయ్యాయని అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంట్ వుంటే వార్త…కానీ బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త అనే విధంగా విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చామని కేసీఆర్ అన్నారు. కేవలం రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కీసీఆర్ అన్నారు.

అప్రతిష్టపాలు చేయడానికే విచారణ కమిషన్

నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే విచారణ కమిషన్ వేశారని కేసీఆర్ అన్నారు.కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన తీరు బాధ కలిగించిందని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జూన్ 15 లోగా నా అభిప్రాయాలు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్దంగా విచారణ పూర్తి కాకముందే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చి పదేండ్లు పరిపాలించినా నాపేరు ప్రస్తావించి… ఏదో దయ తలచి నేను అడిగిన వ్యవదిని ఇచ్చినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం బాగా లేదని పేర్కొన్నారు. అధికార, విపక్షాల మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత..మీ వ్యాఖ్యలన్నీ ఒకవైపై కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్నట్టే వ్యవహరిస్తున్నట్లు వుందని అన్నారు.ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ..మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని కేసీఆర్ అన్నారు.విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టు మీ మాట తీరు వుందని, మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు.ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ కమిషన్ నుంచి స్వచ్చందంగా వైదొలగాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

నాడు సంక్లిష్ట పరిస్థితులు..
తెలంగాణ ఏర్పడేనాటికి సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ రంగం వుండేది. ఏ ఒక్క రంగానికి సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేది కాదు.ప్రతి యేటా లక్షలాది వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయేవి. రాష్ట్రం మొత్తం రైతుల ఆత్మహత్యలు సర్వసాధారణంగా ఉండేవి.కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అనే నానుడి ఉండేది.పారిశ్రామిక రంగానికి ప్రతివారం కొన్ని రోజులు పవర్ హాలిడేలుండేవి.కరెంట్ కోసం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నా చేసిన రోజులను గుర్తు చేశారు. అపార్టుమెంట్లు, దుకాణాల్లో ఎక్కడ చూసినా డీజిల్ జనరేటర్ల సౌండ్ వినపడేది.రాష్ట్రమంతటా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు వుండేవి. గ్రామాల్లో ఉ. 3 గంటలు, సా. 3 గంటలే త్రీ ఫేజ్ కరెంట్ ఉండేది.మండల కేంద్రాల్లో కూడా రోజుకు 8 గంటలు కరెంట్ కోతలుండేవి.మున్సిపాలిటీల్లో కూడా 6 గంటలు కరెంట్ కోతలుండేవి రాజధాని హైదరాబాద్‌లో కూడా 4 గంటలు కరెంట్ కోతలుండేవి .రైతులు, కార్మికులు, సామాన్యులు.. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాధింపబడ్డారని కేసీఆర్ అన్నారు.

అంత్యక్రియలకు స్నానానికి  నీళ్లు లేని దుస్థితి
తెలంగాణలో అంత్యక్రియల సమయంలో స్నానానికి కూడా నీళ్లు లేని దుస్థితి వుండేది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది.విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ వాటా 53.89 శాతం అయినా.. 2,700 మెగావాట్ల కొరత ఉండేది . విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించడం వల్ల 1,500 మెగావాట్ల లోటు వచ్చేదని కేసీఆర్ అన్నారు.గ్యాస్ ఆధారిత విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల 900 మెగావాట్ల లోటు,మొత్తం 5 వేల మెగావాట్ల విద్యుత్ లోటుతో తెలంగాణ ఉండేది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు కఠోర శ్రమ చేశాయి. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా అభివృద్ధి చేశాయి.విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించింది. 2014లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు, ఆ తర్వాత 20 వేల మెగావాట్లకు పెంచినం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లు పదేండ్లలో 2,349 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ విజయాలు ఆషామాషీగా రాలేదు. కేవలం చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు చేశామని కేసీఆర్ అన్నారు. చట్ట ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణం చేపట్టామని చెప్పారు. చట్ట విరుద్ధమైన కమిషన్‌కు మీరు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం విచారకరం. ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్ పదవీ నుంచి స్వచ్చందంగా తప్పుకుని మీ మర్యాదని కాపాడుకోండి అంటూ కమిషన్ కు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text