
విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారిలో తెచ్చిన ఆర్డర్లు రద్దు చేయాలి:ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
రోస్టర్ విధానంలో కాకుండా ప్రమోషన్లు ఇచ్చారు
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ వద్ద నిరసన
హైదరాబాద్, ఆగష్టు 21
విద్యుత్ సంస్థల్లో టీవోవో నంబర్ 954ను, దాని అనుబంధన ఆర్డర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రమోషన్లలో రోస్టర్ విధానాన్ని అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్యాం మనోహర్, స్టేట్ జనరల్ సెక్రటరీ మేడి రమేష్ లు మాట్లాడుతూ గత 2021లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల్లో యాజమాన్యం ఎలాంటి జీవో లేనప్పటికీ దొడ్డిదారిన తీసుకొచ్చిన టీవోవో 954, ఎన్ఓఓ37 37,ఎస్పీఓఓ101, జీటీఓఓ62 లను వెంటనే రద్దు చేసి సీనియార్టీ లిస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల ఆర్డర్లను గత నాలుగేళ్లుగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వేలాది మంది ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులతో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు కలవడానికి ప్రయత్నించినా స్పందించలేదన్నారు. మా నిరసనల సందర్భంగా అప్పటి ట్రాన్స్కో సీఎండీ అప్పుడు ఆర్డర్లను పక్కన పెట్టాస్తామని హామీ ఇచ్చారనీ తెలిపారు.


డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సీనియారిటీని రోస్టర్ విధానంలో కాకుండా మెరిట్ ప్రాతిపదికన నిర్ణయిస్తే ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, ఉమెన్, ఇతర ఉద్యోగులు నష్టపోతారని ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 2024 న ఉంచి కొత్త ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థల యాజమాన్యానికి వినతిపత్రాలు అందిచామని తెలిపారు. అయినా సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే సమస్యను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దశాబ్ధాలుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అమలులో ఉన్న రోస్టర్ విధానాన్ని కాకుండా ప్రమోషన్లు ఇచ్చారని తెలిపారు. ఫలితంగా ఏ ఒక్కరికి రెగ్యూలర్ ప్రమోషన్లు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసులకు సంబంధం లేని విషయాలను విద్యుత్ సంస్థలు తమకు తాముగా కోర్టులకి నెడుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను సైతం కాలరాసే విధంగా విద్యుత్ సంస్థల న్యాయసలహాదారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత యాజమాన్యం ఏకపక్షంగా రిలీవ్ చేసిన ఆంధ్రా ఉద్యోగులు, విభజన కేసుతో జరిగిన నష్టాలు మళ్లీ జరగొద్దంటే మా డిమాండ్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు.

టీవోవో 954 అనుబంధ ఆర్డర్లను రద్దు చేయాలనీ, కాన్ఫిక్వేన్షియల్ సీనియార్టీలో వచ్చిన ప్రమోషన్లను వెంటనే రెగ్యులర్ చేయాలనీ, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడపడుతున్న 23వేల మంది ఆర్టీజన్లను ఎపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. లేనట్టియితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాంపల్లి చంద్రయ్య, సోమ్లా నాయక్, వివిధ సంఘాల, విద్యుత్ సంస్థల ప్రతినిధులు నారాయణ నాయక్, నాగరాజు, ఆనంద్ బాబు, బీచ్ పల్లి, ఆనందం, కుమారస్వామి, సత్యనారాయణ, శరత్ బంద, రవీందర్, కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు