
జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్
హైదరాబాద్, నవంబరు 29
గొల్ల కురుమలకు రూ.2లక్షల నగదు బదిలీ ద్వారా రెండోవిడుత గొర్రెల పంపిణీ చేస్తామని హామినిచ్చి విస్మరించినందున దీనికి నిరసనగా డిసెంబర్ 09న ‘‘ప్రజాభవన్ ముట్టడి’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీ.ఎం.పీ.ఎస్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అధ్యక్షత జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేసినట్టే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గొల్ల కురుమలకు 2లక్షల నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందనీ తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా 80 వేల మంది మూడేండ్ల క్రితం లబ్దిదారుల వాటా కింద ఒక్కొక్కరు రూ.43,750`ల చొప్పున డీడీలు తీసి ఎదురుచూస్తున్నారు. మూడేండ్లు ప్రభుత్వం లబ్ధిదారుల వాటా దగ్గర పెట్టుకొని అవినీతి సాకుతో గొర్రెలివ్వకుండా డీడీ డబ్బులు రిటర్న్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ గొల్లకురురుమలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండేండ్ల నుంచి గొర్రెలకు కనీసం నట్టల మందులు కూడా అందటంలేదు. పశువైద్యశాలల్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉండటంలేదు. గొర్రెల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీరోజు కుక్కల దాడులు, రకరకాల ప్రమాదాల్లో వందలాది గొర్రెలు చనిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. గొర్రెల కాపరులపై రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్టు అధికారుల దాడులు పెరుగుతున్నాయి. రైతు భీమా ఉందనే కారణం చూపి ప్రమాదవశాత్తు మరణిస్తున్న గొర్రెల కాపరులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వడంలేదు. మహబూబ్‌నగర్‌లో ఉన్న దక్కనిజాతి గొర్రెల పరిశోధన కేంద్రం భూములు ఇతర ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తూ దాన్ని మూసివేసే కుట్రలు చేస్తున్నారు. నేటికీ ప్రభుత్వానికి గొల్లకురుమల సంక్షేమం పట్ల ఒక స్పష్టమైన విధానం లేదనీ విమర్శించారు. ఇప్పటికీ పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక మంత్రి లేరు. సీఎం దగ్గరే ఆ శాఖ ఉండటంతో ఎవరని కలిసే అవకాశం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమల్ హజ్బెండరీ డిపార్ట్మెంట్ కు శాశ్వత డైరెక్టర్‌ను, ఇతర అధికారులను నియమించడం లేదు. సమస్యలను ఎవరికి మొర పెట్టుకోవాలో అర్థం కాని స్థితిలో గొర్లకాపరులున్నారని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోపైపు ఏడాది గడిచిందని ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. ఇప్పటికే తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేల దృష్టికి, పశుసంవర్థక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దృష్టికి, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని కురుమ , యాదవులు గొర్రెల పెంపకందారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జీఎంపీఎస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కాడబోయిన లింగయ్య, మద్దెపురం రాజు, అమీర్‌పేట్ మల్లేష్, తుషాకుల లింగయ్య, ఆలేటి యాదగిరి, కాల్వ సురేష్, పరికి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
