తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి
జనగామ, డిసెంబర్ 12,2024:
వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నమని జనగామ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ నాముని పావని కుమారి స్పష్టం చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పావని మాట్లాడుతూ కళాశాలలో ఉచిత అడ్మిషన్లు, ఉచిత పాఠ్యపుస్తకాల తో పాటు అన్ని రకాల సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులున్నారని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని సూచించారు.
కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సబ్జెక్టు లెక్చరర్ల సమక్షంలో స్టడీ అవర్ ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల ఏకాగ్రత పెరగడం కొరకు ధ్యానం చేయించడం, విద్యార్థుల మానసిక వికాసానికి మానవతా విలువలపై అవగాహన కార్యక్రమాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఇంటర్ బోర్డ్ టెలీ మానస్ ప్రోగ్రాం ద్వారా 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ అలవాటు కావడానికి అవకాశాలున్నాయని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలియజేశారు. రాబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటే అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం, అధ్యాపకేతర బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.