
మహాకుంభమేళాకు ఈటల
మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానం
పాల్గొన్న ఎంపీలుడీకే అరుణ, బీబీపాటిల్ 45మంది ప్రతినిధులు సాదర స్వాగతం పలికిన పెరిక సురేశ్
హైదరాబాద్, ఫిబ్రవరి12, 2025
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘మహాకుంభ్’ లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ మంగళవారం పాల్గొన్నారు. గంగా, యుమనా, సరస్వతీ నదులు సంగమించే త్రివేణి సంగమంలో మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు 45మంది ప్రజాప్రతినిధులతో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న ఈటలకు నమో వందేగోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేశ్, కమలేశ్ ఆచార్య స్వామీజీ తదితరులు సాదర స్వాగతం పలికారు.


మహాకుంభ కీలక రోజులు కావడంతో మహాకుంభ్ ఏరియాలో ‘నో వెహికల్ జోన్’ ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈటల రాజేందర్ సాధారణ పౌరునిలా 18కిలోమీటర్లు నడిచి వెళ్లి ఈ పుణ్యస్నాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం కాశీ ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు. జాతి మతం కులాలలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా భక్తజనం ఈమహాకుంభమేళాకు జనసంద్రంగా హాజరవడం భారత దేశ విశిష్టతకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలపై రాజేందర్ మాట్లాడుతూ 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ గత 27రోజులుగా ప్రయాగ్రాజ్లో సేవాకార్యక్రమాలు చేస్తున్నామనీ, రోజు 2వేల మందికి అన్నధానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాధువులకు పదివేల బ్లాంకెట్లు పంచినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, బీబీ పాటిల్, లతో పాటు నేతలు వేణుగోపాల్రెడ్డి, గిరివర్ధన్రెడ్డి, మధుసూధన్రావు, నందకిశోర్, బద్దం మహిపాల్రెడ్డి తదితరులు హాజరైయ్యారు.