
జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ఆరంభం
జనగామ, మే 08, 2025 (ప్రతినిధి): జనగామలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి తొలి విడత ఉచిత ప్రవేశాలు బుధవారం ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు.

దశమ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్, కళాశాలలో జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ (ఉర్దూ మాధ్యమం) కోర్సులు, వృత్తిపరమైన విభాగంలో ఓఏ, ఏ అండ్ టీ, ఎంఎల్‌టీ, ఏఈటీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
దూర ప్రాంతాల విద్యార్థుల కోసం బాలురు, బాలికలకు ప్రత్యేక ఉచిత హాస్టల్ సౌకర్యం, గ్రంథాలయం ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, మెరిట్ మరియు మలబారు ఉపకార వేతనాలు అందజేయబడతాయని పేర్కొన్నారు. డిజిటల్ తరగతులు, సీనియర్ ఆధ్యాపకుల పర్యవేక్షణలో ఎంసెట్ శిక్షణ, ప్రయోగశాలలు, అధ్యయన గంటలు, సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

ఇటీవల ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, కళాశాల సౌకర్యాలను వివరిస్తూ ఉచిత ప్రవేశాల కరపత్రాన్ని ప్రిన్సిపాల్ విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆమె, మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
