
న్యూఢిల్లీ, మే 10, 2025: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన రెండు నెలల ముందు, అమెరికాకు చెందిన ప్రముఖ ఉపగ్రహ చిత్రాల సంస్థ మాక్సార్ టెక్నాలజీస్‌కు ఈ ప్రాంతానికి సంబంధించిన అధిక నాణ్యత ఉపగ్రహ చిత్రాల కోసం ఆర్డర్లు వచ్చాయి. 2024 జూన్ నుంచి ఈ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి, అమెరికాలో నేర ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక జియోస్పేషియల్ సంస్థ మాక్సార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఒప్పందం జరిగిన కొద్ది నెలల తర్వాత 2025 ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు, పహల్‌గామ్‌తో పాటు దాని చుట్టుపక్కల సైనిక ప్రాముఖ్యం కలిగిన పుల్వామా, అనంత్‌నాగ్, పూంచ్, రాజౌరీ, బారాముల్లా ప్రాంతాలకు సంబంధించి 12 ఆర్డర్లు మాక్సార్‌కు అందాయి. 2025 ఏప్రిల్ 12న, అంటే దాడికి పది రోజుల ముందు, మరో ఆర్డర్ వచ్చింది. దాడి తర్వాత ఏప్రిల్ 24, 29 తేదీల్లో మరో రెండు ఆర్డర్లు రావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, రక్షణ ఏజెన్సీలను క్లయింట్లుగా కలిగిన మాక్సార్, 15 నుంచి 30 సెంటీమీటర్ల పిక్సెల్ రిజల్యూషన్‌తో అధిక నాణ్యత చిత్రాలను అందిస్తుంది. భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), 11 స్పేస్ టెక్ స్టార్టప్‌లు దీని క్లయింట్లు. ఒక్కో చిత్రం ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభమై, రిజల్యూషన్ ఆధారంగా ధర మరింత పెరుగుతుంది.

బిఎస్ఐ నేర చరిత్ర మూలాలు
పాకిస్థాన్‌కు చెందిన బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఎస్ఐ) 2024 ప్రారంభంలో మాక్సార్ భాగస్వామిగా చేరింది. బీఎస్ఐ వ్యవస్థాపకుడు ఒబైదుల్లా సయ్యద్, 2006 నుంచి 2015 వరకు అమెరికా నుంచి పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (పీఏఈసీ)కు అధిక సామర్థ్య కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను అక్రమంగా ఎగుమతి చేసినందుకు 2022లో అమెరికా ఫెడరల్ కోర్టులో దోషిగా తేలి ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఈ వ్యవహారంలో అతను 2,47,000 డాలర్ల అక్రమ నిధులను అమెరికా ప్రభుత్వం జప్తు చేసింది. అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిలో పీఏఈసీ పాత్ర కారణంగా అమెరికా దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తుంది.
పహల్‌గామ్ ఆర్డర్లు బీఎస్ఐ నుంచి వచ్చాయా అనేది స్పష్టం కాకపోయినా, రక్షణ నిపుణులు, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఈ ఆర్డర్లు యాదృచ్ఛికమని కొట్టిపారేయలేమని అభిప్రాయ పడుతున్నరు. “నేర చరిత్ర ఉన్న పాకిస్థాన్ సంస్థతో మాక్సార్ భాగస్వామ్యం చేసుకోవడం, బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా ఒప్పందం కుదుర్చుకోవడం ఆందోళనకరం” అని మాక్సార్ సేవలను వినియోగించే సంస్థలు అంటున్నాయి . “భారతదేశం ఇటువంటి ఉపగ్రహ చిత్రాల సంస్థలపై ఒత్తిడి తెచ్చి, పాకిస్థాన్‌తో వ్యాపారాలను నిలిపివేయాలని డిమాండ్ చేయాలి” అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ టెక్నాలజీ అక్రమార్కుల చేతులకు వెళితే ప్రమాదమే
అధిక నాణ్యత ఉపగ్రహ చిత్రాల లభ్యత భద్రతా ఆందోళనలను పెంచుతోంది. “వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు దేశాలు, సైన్యాల గూఢచర్యం, నిఘా సామర్థ్యాలను మెరుగుపరిచాయి. అయితే, ఇవి దుష్టశక్తులు, రాష్ట్రేతర సంస్థల చేతుల్లోకి వెళితే భద్రతకు ముప్పు వాటిల్లుతుంది” అని భారత స్పేస్ నిపుణులు హెచ్చరించారు. పహల్‌గామ్ దాడికి ఈ చిత్రాలు ఉపయోగించబడ్డాయా అనేది స్పష్టం కాకపోయినా, ఆర్డర్లపై విచారణ జరపాలని మాక్సార్‌ను భారతదేశం కోరవచ్చని తెలుస్తోంది.
మాక్సార్ పోర్టల్‌లో చెల్లింపు భాగస్వాములు ఇతరుల ఆర్డర్లను చూడవచ్చు, కానీ వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉన్న చిత్రాలు గోప్యంగా ఉంటాయి. ఆర్డర్ల మూలాన్ని గుర్తించాలంటే మాక్సార్ అనుమతి అవసరం, అది సీక్రెట్ గఅనే కారణాలతో అందించదు.
భారతదేశం తన ఉపగ్రహ నిఘా వ్యవస్థలను ఇంకా అభివృద్ధి చేస్తున్నందున, అధిక నాణ్యత చిత్రాల కోసం విదేశీ సంస్థలపై ఆధారపడుతోంది. రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ, జియోస్పేషియల్ డేటా మార్గదర్శకాల ప్రకారం, సైనిక స్థావరాలు, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే, విదేశీ సంస్థలపై ఇటువంటి నిబంధనలు ఏవీ వర్తించవు. “ఈ వ్యాపార సంస్థలు. డబ్బులు ఇచ్చిన వారికి సేవలు అందిస్తాయి” అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కరాచీలో ప్రధాన కార్యాలయం కలిగిన బీఎస్ఐ, లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్‌లలో శాఖలను కలిగి ఉంది. 1980 నుంచి జియోస్పేషియల్, కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
భారతదేశం తన అంతరిక్ష సామర్థ్యాలను బలోపేతం చేస్తున్న వేళ, పహల్‌గామ్ సంఘటన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల నియంత్రణ, భద్రతా వ్యవస్థల ముప్పు పొంచి ఉంది అనేది తాజా పెహల్గామ్ సంఘటన స్పష్టం చేస్తుంది.
