
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలి: నిపుణుల హెచ్చరిక
గోదావరి-పెన్నా అనుసంధానం అవసరమని సదస్సులో చర్చ
కొల్లి నాగేశ్వరరావు ఐదవ వర్థంతి సందర్భంగా విజయవాడలో మేధోమథనం
విజయవాడ, మే 21: రూ.82 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం-బనకచర్ల ఎత్తిపోతల పథకం ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరమైన, ఖర్చుతో కూడిన ప్రాజెక్టు అని వ్యవసాయ నిపుణులు, ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం అవసరమని వారు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ కార్యదర్శి, సీపీఐ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ఐదవ వర్థంతి సందర్భంగా విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో బుధవారం నిర్వహించిన మేధోమథన సదస్సులో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.
కొల్లి నాగేశ్వరరావు అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, విశ్రాంత ఇంజినీరింగ్ అధికారులు ఐఎస్‌ఎన్ రాజు, పాపారావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాదీశ్వరరావు, రైతు సంఘం నాయకుడు అక్కినేని భవానీ ప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతూ ఐఎస్‌ఎన్ రాజు, నదుల అనుసంధానం అనే ఆలోచనను ఐదు దశాబ్దాల క్రితం ప్రముఖ ఇంజినీర్ కెఎల్ రావు ప్రతిపాదించారని, అయినప్పటికీ గంగా-కావేరీ అనుసంధానం ఇప్పటికీ సాకారం కాలేదని తెలిపారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం రాష్ట్రానికి అత్యవసరమని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా, వరద నీటిని మరో కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించి, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు సరఫరా చేయాలని సూచించారు. ఈ విధంగా అదా అయ్యే కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా తెలుగు గంగ, గాలేరు నగరి, సోమశిల ప్రాజెక్టుల ద్వారా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు అందించవచ్చని వివరించారు.
అయితే, బనకచర్ల ఎత్తిపోతల పథకం అనవసరమని, దీని వల్ల భారీ ఆర్థిక భారం పడుతుందని ఇంజినీర్ పాపారావు విమర్శించారు. గతంలో శంకుస్థాపన చేసిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం, ఈ ప్రాజెక్టు కూడా లక్ష కోట్ల రూపాయలతో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. “ఎవరు అడిగారని బనకచర్లను నెత్తినెత్తుకున్నారు?” అని సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కేంద్రం చెప్పిన దానికి తలొంచడం ఏమిటని నిలదీశారు.
మాజీ ఎంపీ వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ, ఎన్‌టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, అలాంటివి పూర్తి చేయకుండా కొత్తగా రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు చేపట్టడం సరికాదని అన్నారు. రైతు సంఘం నాయకుడు అక్కినేని భవానీ ప్రసాద్, రైతులు సంఘటితమై ఉద్యమించకపోతే ప్రభుత్వం వినే పరిస్థితి లేదని, ప్రతిపక్షం లేని పరిస్థితిలో రైతులే గళమెత్తాలని పిలుపునిచ్చారు.
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐదేళ్ల కాలానికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భారీ ప్రాజెక్టులు చేపట్టడం నీతిపరంగా సరికాదని, విస్తృత చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రూ.5 కోట్ల మూలధనంతో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.82 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామనడం హాస్యాస్పదమని, ఇది గుత్తేదారుల ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.
సదస్సులో వక్తలు, పోలవరం-బనకచర్ల పథకం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని, ఈపీసీ విధానం సాగునీటి రంగంలో అవినీతికి దారితీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, రైతులు, నిపుణులతో చర్చించి విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
