
బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు
హైదరాబాద్, మే 23, 2025: తెలంగాణ మలిదశ ఉద్యమ వీరవనిత, గాన కోకిల, జనసభ నాయకురాలు బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, పట్టణ కేంద్రాల్లో ఘనంగా నివాళులర్పించాలని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డా. దాసరి అజయ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జనసభ ఆధ్వర్యంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తన కోకిల స్వరంతో పాటలు పాడి, ప్రజలను చైతన్యం చేసిన బెల్లి లలిత, సమైక్య సీమాంధ్ర పాలనలో తెలంగాణ పట్ల వివక్షను ఎండగడుతూ, తన గీతాల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. అయితే, ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఆమెను మావోయిస్టు నక్సలైట్ ముఠాతో హత్య చేయించి, ఆమె దేహాన్ని 17 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసిందని డా. అజయ్ కుమార్ ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ, “బెల్లి లలిత హత్య కేసును నాటి టీడీపీ ప్రభుత్వం గానీ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన గానీ చేదించలేదు. బాధిత కుటుంబానికి ఏ ప్రభుత్వం అండగా నిలవలేదు. అంతేకాక, తెలంగాణ ఉద్యమంలో అమరుల సరసన లలిత పేరును గత కేసీఆర్ ప్రభుత్వం చేర్చకపోవడం దుర్మార్గం” అని విమర్శించారు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఆమె చిత్రపటాలకు నివాళులర్పించి, ఆమె వీరత్వాన్ని స్మరించుకోవాలని బీసీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డా. అజయ్ కుమార్ తెలిపారు.
