
యూరరియా కొరతపై లెక్కలతో సమాధానం – కేంద్రం నుంచి కోతలే కారణమని స్పష్టం
హైదరాబాద్, ఆగస్టు 14:
రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టి రాంచందర్‌రావు వ్యాఖ్యలను వ్యవసాయశాఖ ఖండించింది. ఈ మేరకు లెక్కలతో కూడిన సమగ్ర వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపడమే కాకుండా, మీడియాకు కూడా విడుదల చేసింది.
వ్యవసాయశాఖ వెల్లడించిన ప్రకారం, ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించింది. ఇందులో ఆగస్టు వరకు 8.30 లక్షల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 5.18 లక్షల టన్నులే అందాయి. అంటే ఇంకా 3.12 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేయకుండా కోత విధించిందని స్పష్టం చేసింది.
గత ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ కేంద్రం పూర్తి స్థాయి కోటా విడుదల చేయలేదని వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడించాయి.

నెల వారీగా యూరియా కేటాయింపులు – సరఫరా వివరాలు (లక్షల టన్నులు):
- ఏప్రిల్: కేటాయింపు – 1.70 | సరఫరా – 1.21
- మే: కేటాయింపు – 1.60 | సరఫరా – 0.88
- జూన్: కేటాయింపు – 1.70 | సరఫరా – 0.98
- జులై: కేటాయింపు – 1.60 | సరఫరా – 1.43
- ఆగస్టు: కేటాయింపు – 1.70 | సరఫరా – 0.68
- సెప్టెంబరు: కేటాయింపు – 1.50 | సరఫరా – —
మొత్తం: కేటాయింపు – 9.80 | సరఫరా – 5.18
వ్యవసాయశాఖ స్పష్టంగా చెబుతూ – కేంద్రం కోతలే యూరియా కొరతకు కారణమని, రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించిందన్న ఆరోపణలు వాస్తవం కాదని తేల్చిచెప్పింది.

