
తెలంగాణ ఆదాయ పన్ను దాఖలులో దేశంలో ఐదో స్థానం
హైదరాబాద్, సెప్టెంబర్ 15:
దేశంలో ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు దాఖలు చేసిన ఐటిఆర్–1 (ITR-1) రిటర్నుల సంఖ్యలో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది.
న్యూవమా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తెలంగాణలో 60.8 వేల మంది ఈ విభాగంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారు. మహారాష్ట్ర (137.1 వేల), కర్ణాటక (130.6 వేల), తమిళనాడు (78.2 వేల), ఉత్తరప్రదేశ్ (70.2 వేల) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలవడం విశేషం.


తక్కువ జనాభా, భౌగోళిక పరిమాణం పరంగా చిన్న రాష్ట్రం అయినా కూడా, అధిక ఆదాయం వర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో పన్ను దాఖలు చేయడం రాష్ట్ర ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్థికంగా ప్రాధాన్యం కలిగిన గుజరాత్ ఈ టాప్–10 జాబితాలో లేకపోవడం గమనార్హం.
