
నెక్లెస్ రోడ్‌లో ఆల్ ఇండియా హార్టీకల్చర్ షో
హైదరాబాద్, సెప్టెంబరు 18: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు 18వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నర్సరీ మేళా ఇంచార్జీ ఖలీద్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్, హార్టీకల్చర్ ఉత్పత్తులతో కూడిన ఆల్ ఇండియా హార్టీకల్చర్ షోను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఈ మేళాలో టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రదర్శించనున్నట్లు ఖాలీద్ అహ్మద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మొక్కలతో 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
మెడిసినల్ ప్లాంట్స్, కిచెన్, అవుట్‌డోర్, బల్బ్, సీడ్, సీడ్‌లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్‌తో పాటు ఎగ్జాటిక్ ప్లాంట్స్, బోన్సాయ్, వాటర్ లిల్లీస్, కోకో పీట్, ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ , ఆర్గానిక్, ఇనార్గానిక్, నీమ్ కేక్,
గార్డెన్ ఎక్విప్‌మెంట్, ఫామ్ ఎక్విప్‌మెంట్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని కలిపంగ్ నుంచి ప్రత్యేక ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ కూడా ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. డిసేబుల్ పర్సన్స్ స్టాల్ లు ఏర్పాటు చేశాము. ఈ ప్రదర్శనలో రూ.30 నుంచి రూ.3 లక్షల వరకు విలువైన మొక్కలు లభ్యమవుతాయని, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నర్సరీ మేళాను తెలంగాణ హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా గురువారం (సెప్టెంబరు 18) ప్రారంభించనున్నారు. మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా సందర్శిస్తారు అని తెలిపారు. మొక్కల ప్రియులు, హార్టీకల్చర్ ఔత్సాహికులు ఈ మేళాను సందర్శించి, ఆధునిక గార్డెనింగ్ పద్ధతులను తెలుసుకోవాలని ఖాలీద్ అహ్మద్ కోరారు.
