
పచ్చదన ప్రియులకు కనులపండుగ
సాగర తీరంలో అద్భుత ప్రదర్శన
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 18వ గ్రాండ్ నర్సరీ మేళా సందర్శకులను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అరుదైన మొక్కలు, సేంద్రీయ ఎరువులు, విత్తనాలు, ఔషధ మొక్కలు, అలంకార మొక్కలు, విదేశీ పండ్ల రకాలు, పూల మొక్కలు సహా 150కి పైగా స్టాల్స్‌లో వివిధ ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. హుసేన్ సాగర్ తీరంలో ఈ అద్భుతమైన పచ్చదన ప్రదర్శన సందడిగా సాగుతోంది.
ఇండోర్, అవుట్‌డోర్ మొక్కలు, బోన్సాయ్, క్రీపర్స్, వాటర్ లిల్లీస్, ఎగ్జాటిక్ ప్లాంట్స్, కోకో పీట్, గార్డెన్ పరికరాలు, పూల కుండీలు, స్టాండ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక సాంకేతికతలైన వర్టికల్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్‌పై పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పూల మొక్కలు కొలువుదీరాయి. వెస్ట్ బెంగాల్‌లోని కాలీపంగ్ నుంచి తీసుకొచ్చిన ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విలువైన మొక్కలు, అందుబాటు ధరలు
ఈ ప్రదర్శనలో రూ.30 నుంచి రూ.3 లక్షల వరకు విలువైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాల్లో టెర్రస్ గార్డెనింగ్‌లో పెంచడానికి అనువైన అరుదైన రుద్రాక్ష, మందారం, బే లీఫ్, ఔషధ మొక్కలు, హైబ్రిడ్ రకాలు, విదేశీ పండ్ల మొక్కలు సహా వివిధ రకాల అలంకార మొక్కలు, పండ్ల, పూల మొక్కలు ఈ మేళాలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నగరవాసులు, గృహిణులు, యువత ఈ మేళాను సందర్శించి, సిటీ గార్డెనింగ్, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పచ్చదనం, సేంద్రీయ జీవనం పట్ల ఆసక్తి:
వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రసాయన ఎరువులకు ప్రత్యామనాయంగా సహజ, సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా ఉత్పత్తి చేసిన పంటలు, ఆహారంపై ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ మేళాలో వేపపిండి, కానుగ పిండి, ఆముదం, ఆవాల పొడి, సీతాఫలం విత్తనాల పొడి వంటి సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ పురుగుమందులు నర్సరీ మేళాలో అందుబాటులో ఉన్నాయి.


సందర్శకుల్లో ఉత్సాహం
“మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం, సేంద్రీయ జీవనం సాధ్యమవుతుంది. ఇంట్లో టెరారియం వంటి చిన్న ఎకోసిస్టమ్‌ను సృష్టించడం ద్వారా పచ్చదనాన్ని పెంచవచ్చు,” అని ఓ నర్సరీ నిర్వాహకుడు తెలిపారు. సందర్శకులు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి, అరుదైన మొక్కలు, విత్తనాలు, సేంద్రీయ ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. “షో ప్రారంభంలో వస్తే తాజా మొక్కలు, కావలసిన రకాలు సులభంగా దొరుకుతాయి. గార్డెనింగ్ చేయడం వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది,” అని ఓ సందర్శకుడు చెప్పారు.

“చెట్ల ప్రేమికులు, గార్డెనింగ్ ఔత్సాహికులు తప్పకుండా ఈ మేళాను సందర్శించాలి. పాట్స్, పాటింగ్ మిక్స్‌ల నుంచి అన్ని రకాల మొక్కల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి,” అని నర్సరీ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ వివరించారు.

