
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. హుసేన్ సాగర్ తీరంలో ఈ అద్భుతమైన పచ్చదన ప్రదర్శన సందడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అరుదైన మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార మొక్కలు, విదేశీ పండ్ల రకాలు, పూల మొక్కలు సహా ఇక్కడి స్టాల్స్‌లో కొలువు దీరాయి. అరుదైన వివిధ ఉత్పత్తులు హార్టీకల్చర్ మేళాలో ప్రదర్శనకు ఉంచారు. ఇండోర్, అవుట్‌డోర్ మొక్కలు, బోన్సాయ్, క్రీపర్స్, వాటర్ లిల్లీస్, ఎగ్జాటిక్ ప్లాంట్స్, కోకో పీట్, గార్డెన్ పరికరాలు, పూల కుండీలు, స్టాండ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పూల మొక్కలు కొలువుదీరాయి. వెస్ట్ బెంగాల్‌లోని కాలీపంగ్ నుంచి తీసుకొచ్చిన ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.


అరుదైన రుద్రాక్ష, మందారం, బే లీఫ్, ఔషధ మొక్కలు, హైబ్రిడ్ రకాలు, విదేశీ పండ్ల మొక్కలు సహా వివిధ రకాల అలంకార మొక్కలు, అర్భన్ ఫారెస్ట్రీ రకాలు, పండ్ల, పూల మొక్కలు ఈ మేళాలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నగరవాసులు, గృహిణులు, యువత ఈ మేళాను సందర్శించి, మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా మొక్కల ప్రియులతో కిటకిటలాడుతోంది. సోమవారం వరకు ఈ షో అందుబాటులో ఉంటుందని మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు.



