
ఒక్కొక్కరికి రూ.1.95 లక్షలు, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.5,500
హైదరాబాద్, సెప్టెంబర్ 22, 2025: సింగరేణి కార్మికులకు ఈ ఏడాది లాభాల వాటాగా భారీ బోనస్ దక్కనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.6,394 కోట్ల నికర లాభాలు సాధించగా, ఇందులో 34% వాటాను కార్మికులకు బోనస్‌గా పంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 41,000 మంది పర్మినెంట్ కార్మికులకు ఒక్కొక్కరికి సగటున రూ.1,95,610 బోనస్ లభించనుంది. గత ఏడాది కంటే ఇది రూ.8,289 అధికం. అంటే, 4.4% ఎక్కువ! అదనంగా, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 బోనస్‌గా ఇవ్వనున్నారు.

సింగరేణి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం రూ.819 కోట్లను బోనస్‌గా కేటాయించగా, కొత్త ప్రాజెక్టుల కోసం రూ.4,034 కోట్లు పక్కనపెడుతున్నట్లు తెలిపారు.

సింగరేణిని బలోపేతం చేసే చొరవ
తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్న సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాక్‌లను తిరిగి సింగరేణికి అప్పగించేందుకు కృషి చేస్తామన్నారు. “సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీపడి, తక్కువ ధరకే బొగ్గు అమ్మే స్థాయికి ఎదగాలి. దేశానికి వెలుగులు ఇస్తున్న ఈ సంస్థను మరింత అభివృద్ధి చేయడమే మా లక్ష్యం” అని రేవంత్ పేర్కొన్నారు.
కొత్త రంగాల్లోకి సింగరేణి
సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొని కొత్త బ్లాక్‌లు సాధించాలని, కీలక ఖనిజ రంగంలోకి విస్తరించాలని భట్టి విక్రమార్క సూచించారు. “కొత్త ప్రాజెక్టులకు నిధుల కోసం రూ.4,034 కోట్లు కేటాయించాం. కార్మిక సంఘాలు, కార్మికులు సహకరించి సింగరేణిని మరింత బలోపేతం చేయాలి” అని ఆయన కోరారు.

2000 నుంచి బోనస్ ప్రస్థానం
2000లో సింగరేణి లాభాల వాటా బోనస్‌ను తొలిసారి ప్రకటించినప్పుడు, రూ.300 కోట్ల లాభాల నుంచి 10% వాటాగా రూ.30 కోట్లు పంచారు. అప్పట్లో 1.07 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2,782 బోనస్ లభించింది. అప్పటి సగటు జీతం రూ.8,500 కాగా, ఇప్పుడు అది రూ.1.7 లక్షలకు చేరింది. గత ఏడాది 33% లాభాల వాటాగా రూ.763 కోట్లు పంచగా, ఒక్కొక్కరికి రూ.1,87,321 దక్కింది. ఈ ఏడాది 34% వాటాతో రూ.1,95,610 బోనస్ అందనుంది.

విశేష ప్రగతి
2023-24లో రూ.4,701 కోట్ల లాభాలతో పోలిస్తే, 2024-25లో 36% వృద్ధితో రూ.6,394 కోట్ల లాభాలు సాధించడం సింగరేణి సత్తాను చాటుతోంది. ఒడిశాలో నైని బ్లాక్‌ను సాధించిన సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

