
డిగ్రీ కూడా పూర్తి చేయని కుర్రాడు ఈ రితేష్ అగర్వాల్
హోటల్ అనగానే మనకి గుర్తొచ్చేది తలపెట్టిన బడ్జెట్, లభించే సౌకర్యాలు. కానీ ఒక 19 ఏళ్ల కుర్రాడు ఆ ఆలోచనలన్నింటినీ మార్చేశాడు. అతని పేరు రితేష్ అగర్వాల్. డిగ్రీ కూడా పూర్తిచేయని ఈ యువకుడు, ఈ రోజు “ఓయో రూమ్స్” పేరుతో 60 వేల కోట్లకు పైబడిన వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.
చిన్న ఊరి కుర్రాడి కలలు
ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన రితేష్, చిన్నప్పటి నుంచే కుటుంబానికి తోడ్పడటానికి కష్టాలు పడ్డాడు. నాన్న చిన్న కిరాణా షాపు నడిపేవాడు. తాను 13 ఏళ్ల వయసులోనే సిమ్ కార్డులు అమ్మేవాడు. చదువు కొనసాగించినా, డిగ్రీ వరకు మాత్రమే. తర్వాత బిజినెస్ పైనే దృష్టి పెట్టాడు.

ఓ ఆలోచన… కొత్త దారులు
ఒకసారి రాత్రి హోటల్‌లో బస చేయాల్సి వచ్చిన రితేష్, అక్కడ ఎదురైన అసౌకర్యాలే అతనికి కొత్త ఆలోచన కలిగించాయి. సాధారణ హోటళ్లలో శుభ్రత లేకపోవడం, సరైన సదుపాయాలు లేకపోవడం అతన్ని ఆలోచింపజేశాయి. 2012లో మొదటగా Oravel Stays పేరుతో బుకింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అయితే పెట్టుబడుల కొరత సమస్యగా మారింది. అదే సమయంలో PayPal యజమాని ప్రకటించిన Theil Fellowshipను గెలుచుకుని లక్ష డాలర్ల ఫండింగ్ తెచ్చుకున్నాడు. అదే అతని ప్రయాణానికి మలుపు.

2013లో ఓయో జననం
అలా 2013లో OYO Rooms అధికారికంగా పుట్టింది. తక్కువ ఖర్చుతో శుభ్రత, ఫ్రీ ఇంటర్నెట్, సులభమైన బుకింగ్ వంటి సదుపాయాలు కలిగిన హోటళ్లను వినియోగదారుల ముందుంచాడు. జంటలు సులభంగా రూమ్ బుక్ చేసుకునే విధానం కలపడంతో ఓయో పేరు చకచకా వ్యాపించింది. హోటళ్ల రెవిన్యూ పెరగడంతో భాగస్వామి హోటళ్లు కూడా పెరిగాయి.
సాఫ్ట్‌బ్యాంక్ ఫండింగ్ – గ్లోబల్ అడుగులు
2015లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడి పెట్టడంతో ఓయో ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు 80కిపైగా దేశాల్లో 40 వేల హోటళ్లు, 17 వేలమందికి పైగా ఉద్యోగులతో వ్యాప్తి చెందింది.


కోవిడ్ షాక్ – వ్యూహాల మార్పు
కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాపారం దాదాపు కుప్పకూలిపోయింది. IPO ప్రయత్నం కూడా సెబీ ఆదేశాలతో ఆగిపోయింది. చాలామంది “ఓయో ముగిసింది” అన్నారు. కానీ రితేష్ వేరే మార్గం ఎంచుకున్నాడు. లాభాలు ఇవ్వని హోటళ్లను విడిచిపెట్టాడు. మళ్లీ రెవిన్యూ షేరింగ్ మోడల్‌కు వచ్చి లాభాల్లోకి చేరాడు.
సక్సెస్ సీక్రెట్ ఏంటి?
రితేష్ విజయానికి ప్రధాన కారణం – మార్కెట్ అవసరాలు అర్థం చేసుకోవడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం. జంటలు మాత్రమే కాకుండా, దేవాలయాలున్న ప్రాంతాల్లో ఎక్కువ బుకింగ్స్ రావడం, కుటుంబాల కోసం కొత్త పాలసీలు ప్రవేశపెట్టడం ఓయో స్థిరపడడానికి కారణమయ్యాయి.

ట్రంప్ కూడా మెచ్చిన యువకుడు
2020లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రితేష్ వ్యాపార దృష్టిని పొగడటం, ఒక సాధారణ భారత యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఘనత.
On Your Own – OYO
ఓయో అంటే On Your Own. కానీ నిజంగా ఈ విజయగాధ చెప్పేది ఒక్కటే – వ్యాపారం చేయడానికి డబ్బు కాదు, కొత్త ఆలోచన, పట్టుదల కావాలి. డిగ్రీ లేకపోయినా, తెలివి, దార్శనికత ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని రితేష్ అగర్వాల్ నిరూపించాడు.

