
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో రిటైల్ లిక్వర్ A4 షాపుల లైసెన్స్ పీరియడ్ 2025-27 కోసం ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్, IAS ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం గౌడులు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించే షాప్‌ల గుర్తింపు కోసం జిల్లా కలెక్టర్లు సెప్టెంబర్ 25న డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సెప్టెంబర్ 26న వెలువడనుంది. అదే రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై అక్టోబర్ 18 వరకు కొనసాగుతుంది.

లైసెన్సీల ఎంపిక కోసం డ్రా ఆఫ్ లాట్స్ అక్టోబర్ 23న నిర్వహించనున్నారు. రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ (RSET) మొదటి విడత చెల్లింపు అక్టోబర్ 23, 24 తేదీల్లో జరగనుంది. ఎంపికైన షాపులు డిసెంబర్ 1, 2025 నుండి ప్రారంభమై 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితి కొనసాగనుంది.
ఈ ప్రక్రియలో భాగంగా టెండర్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కూడా ఉత్తర్వులను ధ్రువీకరించారు.


తెలంగాణలో కొత్త ఎక్సైజ్ పాలసీ డిసెంబరు 1, 2025 నుంచి నవంబరు 30, 2027 వరకు అమల్లోకి రానుంది. ఈసారి ఒక్కో అప్లికేషన్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించగా, ఇది రీఫండ్ కాని విధంగా ఉంటుంది. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్ షాపుల కోసం డ్రా పద్ధతిలో ఎంపిక జరుగుతుంది. సెప్టెంబరు 26 నుంచి దరఖాస్తులు ప్రారంభమై, అక్టోబర్ 18తో ముగియగా, అక్టోబర్ 23న డ్రా నిర్వహించనున్నారు. 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు నిర్ణయించగా, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి 10 లక్షల వరకు ఉండనున్నాయి. గత పాలసీ సమయంలోనే 1,31,490 దరఖాస్తులు రావడంతో ప్రభుత్వానికి 2,629 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
