
హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పెరిక సురేష్ గృహంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ క్షేత్రస్థాయిలో గ్రామీణ, బూత్ స్థాయి వరకు బలమైన పునాదులు వేసిందని, రాబోయే ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వేదమంత్రాల నడుమ గోవు పూజ, ద్వార పూజ, మండప ఆరాధన, మహాద్వార ప్రవేశం, వాస్తు పూజ, లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం, సుందరకాండ పారాయణం, వివిధ హోమాలతో కూడిన శాస్త్రోక్త క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్, పెరిక సురేష్ దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
