
సరూర్‌నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డుకు
తెలంగాణకు గిన్నిస్ రికార్డు దిశగా అట్టహాసం!
- 10 వేల ఆడబిడ్డలతో బతుకమ్మ జాతర.. 63 అడుగుల రికార్డు వేడుకకు హైదరాబాద్ సిద్ధం
- ప్రపంచానికి పరిచయం కానున్న తెలంగాణ బతుకమ్మ.. గిన్నిస్ బుక్‌లోకి అడుగుపెట్టే వేళ!
హైదరాబాద్, సెప్టెంబర్ 29 :
ఆడబిడ్డల పండుగ బతుకమ్మను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా సన్నాహాలు చేస్తోంది. రాజధాని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ఈ రోజు (సెప్టెంబర్ 29) 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ నిర్మాణంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మహోత్సవంలో సుమారు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.
ఈ భారీ వేడుక విజయవంతం కావాలంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, పర్యాటక, సాంస్కృతిక, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. స్టేడియం పరిసర రహదారుల మరమ్మతులు, శుభ్రత, లైటింగ్ అలంకరణలు వేగంగా పూర్తి చేశారు. అలాగే ట్యాంక్‌బండ్, పివి మార్గ్, సెక్రటేరియట్ వంటి ముఖ్య ప్రాంతాలు పండుగ వాతావరణంతో ముస్తాబయ్యాయి.


తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను ఆడపడుచులు నవరాత్రి సందర్భంలో పూలతో అలంకరించి, గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ జరుపుకుంటారు. ఇది మహిళల ఐక్యత, ప్రకృతి పూజ, సాంప్రదాయాలకు ప్రతీక. గతంలోనూ భారీ బతుకమ్మలతో రికార్డులు సృష్టించినప్పటికీ, ఈసారి 63 అడుగుల ఎత్తుతో కొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ మహోత్సవంలో మహిళల భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. బతుకమ్మల విసర్జన స్థలాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలని సూచనలు ఇచ్చింది. నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లన్నీ పూల కాంతుల్తో మెరిసిపోతున్నాయి.
ఈవెంట్ ద్వారా “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం” ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

