
“ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల కోసం భారీ ఉత్సాహం: నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ..!
హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రతినిధి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూయెన్సీలు (జడ్పీటీసీ), మండల పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూయెన్సీలు (ఎంపీటీసీ) ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 197, 198 ప్రకారం ఈ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 29న గెజిట్‌లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, తొలి విడతలో 31 జిల్లాల్లోని 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం (అక్టోబర్ 9) నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 11 (శనివారం) సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12 (ఆదివారం)న జరుగుతుంది. తిరస్కృత నామినేషన్లపై అప్పీళ్లు అక్టోబర్ 13 వరకు స్వీకరిస్తారు. అప్పీళ్ల పరిష్కారం అక్టోబర్ 14లోపు పూర్తి చేస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అక్టోబర్ 15 (బుధవారం) చివరి తేదీ. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23 (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రెండో విడత పోలింగ్ అక్టోబర్ 27 (సోమవారం)న నిర్వహిస్తారు. రెండు విడతల ఓట్ల లెక్కింపు నవంబర్ 11 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఎం. రాణి కుముదిని జారీ చేసిన ప్రెస్ నోట్‌లో ఈ వివరాలు తెలిపారు. జిల్లాల వారీగా ఎన్నికల వివరాలు, ఓటర్ల జాబితాలు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. గెజిట్ కాపీలు టె-పోల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
